ముంచుకొస్తున్న యాస్ తుపాన్..90 రైళ్లు రద్దు

ముంచుకొస్తున్న యాస్ తుపాన్..90 రైళ్లు రద్దు
  • తుపాన్ ప్రభావాన్ని బట్టి మరికొన్ని రైళ్లు రద్దు చేసే యోచనలో రైల్వే శాఖ

బగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘యాస్’ తుపాన్ తీరం వైపు ముంచుకొస్తోంది. మరికొద్ది గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ తుపాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో  భారత రైల్వే శాఖ ఇప్పటి వరకు 90 రైళ్లు రద్దు చేసింది. తుపాను ప్రభావం ఉండే ఈ రాష్ట్రాల గుండా వెళ్లే మరికొన్ని రైళ్లను కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు భారత రైల్వే అధికారులు ప్రకటించారు. పరిస్థితిని బట్టి రద్దుపై నిర్ణయం తీసుకుంటామని.. ప్రయాణికులకు ఆటంకం కలగకూడదనే ఆలోచనకే ప్రాధాన్యత ఇస్తామని అయితే ప్రాణాలు ముఖ్యం కాబట్టి ముందుగా ప్రజల ప్రాణ రక్షణకే పెద్దపీట వేస్తున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. రద్దు చేస్తున్న రైళ్ల వివరాలను ఈస్ట్ కోస్టు రైల్వే ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో అప్డేట్ చేస్తోంది. 
మంగళవారం అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉండడంతో ఒడిశాలోని పారాదీప్, దమ్రా తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. తుపాను తీవ్రతతో ఈ ప్రాంతాల్లో గంటకు 160 కిలోమీటర్ల అతివేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాయుసేన, నావికాదళాలను కేంద్రం అప్రమత్తం చేసింది. అవసరమైన చోట్ల సహాయక చర్యల కోసం యుద్ధ విమానాలతోపాటు, హెలికాఫ్టర్లతో 90 బృందాలు రెడీగా ఉన్నాయని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు.