మయన్మార్​లో మోకా తుఫాను బీభత్సం

మయన్మార్​లో మోకా తుఫాను బీభత్సం
  • భారీ వర్షాలతో ముంచెత్తిన వరదలు
  • లోతట్టు ప్రాంతాల్లోకి  చేరిన సముద్రపు నీరు
  • భీకర గాలులకు ఎగిరిపోయిన పైకప్పులు
  • ఆరుగురు మృతి, 700 మందికి గాయాలు

ఢాకా : మయన్మార్ లో మోకా తుఫాను సోమవారం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల వల్ల పలు పట్టణాల్లో వరదలు పోటెత్తాయి. తీరంలోని పది లోతట్టు ప్రాంతాల్లో సముద్రపు నీళ్లు చేరాయి. తుఫాను ధాటికి పశ్చిమ మయన్మార్  తీర ప్రాంతంలో ఆరుగురు చనిపోయారు. సిత్వె టౌన్ షిప్​లో మఠాలు, స్కూళ్లలో తలదాచుకున్న 20 వేల మందిలో బలమైన గాలులకు 700 మంది గాయపడ్డారు. భీకర గాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. భారీ వర్షాల వల్ల పోటెత్తిన వరద నీళ్లు వీధులు, ఇండ్లలోకి చేరాయి. దీంతో స్థానికులు బిల్డింగులు, అపార్ట్​మెంట్ల పైకప్పులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. సముద్ర మట్టం 12 అడుగుల ఎత్తుకు పెరిగింది. సముద్రపు నీళ్లలో చిక్కుకున్న వెయ్యి మందిని రెస్క్యూ బలగాలు రక్షించాయి. తుఫాను ధాటికి కమ్యూనికేషన్  వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. ఆదివారం మధ్యాహ్నం మోకా తుఫాను తీరం దాటింది. ‘‘ఆదివారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత తుఫాను కాస్త బలహీనపడింది. వరద నీటిలో చిక్కుకోకుండా చాలా మంది స్థానికులు రాత్రంతా ఇండ్ల పైకప్పులు ఎక్కి కూర్చున్నారు. రాత్రంతా గాలులు భీకరంగా వీచాయి. సోమవారం ఉదయం వరదలు పోటెత్తిన ప్రాంతాల్లో 5 ఫీట్ల ఎత్తు వరకు నీళ్లు వచ్చాయి. ఉదయం గాలుల తీవ్రత తగ్గడం, ఎండ కాయడంతో సహాయక పనులు ముమ్మరం చేశాం. లోతట్టు ప్రాంతాల్లోని నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయం చేయాలని సివిల్  సొసైటీ సంస్థలు, అధికారులకు విజ్ఞప్తి చేశాం” అని ఓ అధికారి తెలిపారు. 

బంగ్లాదేశ్​కు తప్పిన ముప్పు

మోకా తుఫాను ప్రభావం నుంచి బంగ్లాదేశ్  బయటపడింది. ఆ దేశంపైనా మోకా ప్రభావం ఉండొచ్చని అధికారులు ముందు హెచ్చరించారు. దీంతో తీర ప్రాంతా ల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ప్రభావం పెద్దగా పడలేదని, సెయింట్  మార్టిన్  దీవిలో 12 మంది గాయ పడ్డారని బంగ్లాదేశ్  మీడియా తెలిపింది. 300 ఇండ్లు డ్యామేజ్  అయ్యాయని వివరించింది.

కూలిన ఇండ్లు, మొబైల్​ టవర్లు

మోకా తుఫాను ధాటికి మయన్మార్ లో రఖీనే స్టేట్ లోని సిత్వె, గ్వా, క్యాక్ ప్యూ టౌన్ షిప్ లలో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఆ పట్టణాలలో భారీ గాలులకు సెల్ ఫోన్  టవర్లు నేలకూలాయి. కోకో దీవుల్లో బిల్డింగుల రూఫ్​లు ఎగిరిపోయాయి. ఈ దీవుల్లో గంటకు 425 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని అధికారులు తెలిపారు.