హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మరి కొన్ని గంటల్లో మోంథా తీవ్ర తుఫాన్‌గా మారి ఏపీ తీరం వైపు రానుందని వెల్లడించింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖకు 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న మోంథా.. మంగళవారం (అక్టోబర్ 28) రాత్రి, లేదా బుధవారం (అక్టోబర్ 29) ఉదయం మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుందని తెలిపింది.
మోంథా తుఫాను ఎఫెక్ట్ తెలంగాణపైన పడింది. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అక్టోబర్ 28న తెలంగాణలోని 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తుఫాన్ ప్రభావంతో మంగళవారం (అక్టోబర్ 28) రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వాన పడుతోందని పేర్కొంది. ఈ మేరకు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అక్టోబర్ 29న 4 జిల్లాలకు ఆరెంజ్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్
బుధవారం (అక్టోబర్ 28) రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ పేర్కొంది.
