బంగ్లాదేశ్​లో సైక్లోన్ ‘సిత్రంగ్’ బీభత్సం

బంగ్లాదేశ్​లో సైక్లోన్ ‘సిత్రంగ్’ బీభత్సం

ఢాకా: బంగ్లాదేశ్​లో సైక్లోన్ ‘సిత్రంగ్’ బీభత్సం సృష్టించింది. తుఫాను ధాటికి పలు ప్రాంతాల్లో 16 మంది చనిపోయారు. తీర ప్రాంతాల్లోని 15 జిల్లాల్లో కరెంట్ సరఫరాను పూర్తిగా బంద్ చేశారు. దీంతో పది లక్షల మంది చిమ్మచీకట్లో గడపాల్సి వచ్చింది. మరో పది లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దక్షిణ, నైరుతి ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. సోమవారం రాత్రి సైక్లోన్ సిత్రంగ్ తీరం దాటిందని ఆఫీసర్లు తెలిపారు. అట్లాంటిక్, పసిఫిక్  మహాసముద్రాల్లో  సంభవించే హరికేన్లు, టైఫూన్లతో సమానంగా సిత్రంగ్ ప్రభావం చూపిందని వెల్లడించారు. ప్రాణనష్టాన్ని నివారించడానికి మిలియన్ మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ‘‘చాలాచోట్ల చెట్లు మీద పడి 14 మంది చనిపోయారు. జమునా నదిలో ప్రతికూల వాతావరణం కారణంగా పడవ మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆస్తినష్టానికి సంబంధించి రిపోర్టు రావాల్సి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని సైక్లోన్ షెల్టర్లకు తరలించాం. సోమవారం రాత్రంతా వారు ఆ షెల్టర్లలోనే గడిపారు. మంగళవారం వారు తమ ఇళ్లకు వెళ్లిపోయారు” అని విపత్తు నిర్వహణ మంత్రిత్వశాఖ సెక్రటరీ కమ్రుల్ తెలిపారు. ఢాకా, ఖుల్నా, బరిసాల్​లో సిత్రంగ్ ప్రభావం ఎక్కువగా కనిపించిందని, ఈ ప్రాంతాల్లో 32.4 సెంటీమీటర్ల వర్షం కురిసిందని ఆయన వివరించారు.

ఇండ్లలోకి పాములు

దక్షిణ దీవిలోని మహేష్ కాలీలో తుఫాను ధాటికి చెట్లు నేలకూలాయి. రాత్రంతా భీకర గాలులు స్థానికులను వణికించాయి. ‘‘గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మేము నిద్ర పోలేకపోయాం. మా ఇండ్లు ఎక్కడ డ్యామేజ్ అవుతాయేనని భయపడ్డాం. వర్షాలకు చాలా ఇండ్లలో పాములు వచ్చాయి. ఇండ్లు మునిగిపోయాయి” అని స్థానికులు తెలిపారు. కాగా సిత్రంగ్ సైక్లోన్​ను దృష్టిలో పెట్టుకొని పొరుగున ఉన్న వెస్ట్ బెంగాల్​లోనూ వేలమందిని వంద రిలీఫ్​ సెంటర్లకు తరలించామని భారత అధికారులు తెలిపారు.