
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల ప్రయోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణపర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించింది. ఈకేసులో భాగంగా మంగళవారం ( ఆగస్టు 11న ) విచారణకు హాజరు కావాలని దగ్గుబాటి రానాకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రేపు విచారణకు హాజరుకానున్నారు. అక్రమ లావాదేవీలకు సంబంధించిన వివరాలు, అలాగే ఈ బెట్టింగ్ యాప్‌లతో వారికున్న సంబంధాలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం.
ఈ బెట్టింగ్ యాప్ ల కేసులో జూలై 23న విచారణకు హాజరుకావాలంటూ గతంలో రానాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ముందస్తు కార్యక్రమాలు, షూటింగ్స్ వల్ల హాజరు కాలేనని, తనకు కొంత సమయం కావాలని రానా ఈడీని కోరారు. దీంతో ఆయన అభ్యర్థనపై ఈడీ అధికారులు ఆగస్టు 11న కచ్చితంగా విచారణకు రావాలని తెలిపారు.
ఇటీవల హీరో విజయ్ దేవరకొండ, నటుడు ప్రకాష్ రాజ్ లు ఈడీ విచారణకు హాజరయ్యారు. వారి బ్యాంక్ లావాదేవీలు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కోసం వారు అందుకున్న పారితోషికాలపై అధికారులు కూలంకషంగా వివరాలు సేకరించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు, నిర్వహకులతో సంబంధాలపై ఈడీ ఆరా తీసింది.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో వచ్చిన ఆదాయం, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ యాప్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ భారీగా డబ్బులు సంపాదించారని, ఇందులో అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు.
ఇక, ఈ నెల 13న నటి మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఆమెకు సంబంధించిన లావాదేవీల వివరాలను కూడా ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. టాలీవుడ్ ప్రముఖులు ఈ కేసులో వరుసగా విచారణకు హాజరవడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈడీ అధికారులు సేకరించిన సమాచారం ఆధారంగా భవిష్యత్తులో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.