ఉద్యమంగా దళిత బంధు

ఉద్యమంగా దళిత బంధు

హైదరాబాద్ :  మనదేశంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా దళిత ప్రజలు దుర్భర పేదరికంలో మగ్గుతున్నారనేది నగ్న సత్యం అన్నారు సీఎం కేసీఆర్. 75వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం గోల్కండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం ప్రజలనుద్దేశించిం మాట్లాడారు. దళితజాతిని దారిద్ర్యం ఒక్కటే కాదు, ఆ వర్గం పై ఉన్న సామాజిక వివక్ష కూడా తరతరాలుగా బాధిస్తున్నది. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా దళితుల జీవితాల్లో ఇంకా చీకటే అలుముకొని ఉందనే కఠోర వాస్తవాన్ని మనమందరం అంగీకరించి తీరాలన్నారు. దేహంలో కొంతభాగాన్ని ఖండించితే ఆ దేహం కుప్పకూలుతుందని.. అదే విధంగా దేశంలో ఒక పెద్ద ప్రజా సమూహాన్ని అణచివేస్తే ఆ దేశం కూడా కుప్పకూలుతుందనే నిజాన్ని అందరూ  గ్రహించాలన్నారు. “ప్రజాస్వామ్యమంటే సమానవత్వమే. వీలయినంత తొందరగా దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపాలి, దళితుల అభివృద్ధి అందుకు మొదటి సోపానం కావాలి” అని అన్న భారత రాజ్యంగ నిర్మాత  బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లోని గంభీరతను దేశ పరిపాలనా వ్యవస్థలన్నీ ఇప్పటికైనా గ్రహించాలన్నారు. తెలంగాణా ఏర్పడిన నాటినుండీ అణగారిన కులాల  వికాసం దిశగా  ప్రభుత్వం బలమైన అడుగులువేసిందని చెప్పారు. దళితులలో విద్యా వికాసం చోటు చేసుకోవాలి అనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్ళను స్థాపించిందని తెలిపారు. 2014 తెలంగాణా ఏర్పడేనాటికి దళిత విద్యార్థుల  కోసం ఏర్పాటైన  రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య కేవలం 134 మాత్రమే అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ఈ ఏడు సంవత్సరాల్లో కొత్తగా 104 స్కూళ్ళు ఏర్పాటు చేసిందన్నారు. ఈరోజు రాష్ట్రంలో దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య 238కి పెరిగిందని.. ఈ ఏడెండ్లలో ఎస్, సి మహిళల కోసం 30 డిగ్రీ కళాశాలల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు. 
 
ఒక ఆర్థిక సంవత్సరం లో SC ప్రగతి నిధి కింద కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే, మిగిలిన నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న సీఎం..దళిత విద్యార్థులు  విదేశాలలో విద్యనభ్యసించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా 20 లక్షల రూపాయల  అత్యధిక మొత్తాన్ని  స్కాలర్ షిప్ గా  అందిస్తున్న ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణాప్రభుత్వం అన్నారు. దళితజాతిని ప్రత్యెక శ్రద్ధతో ఆదుకోవడం నాగరిక సమాజానికి ప్రధాన బాధ్యత. అది  ప్రజాస్వామిక ప్రభుత్వాల  ప్రాథమిక విధి. అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే నిజమైన దేశభక్తి. అదే నిజమైన దైవసేవ.  మానవసేవే మాధవసేవ అని మహాత్ముడు ఏనాడో పేర్కొన్నాడు. ఈ దిశగా జరిగే ప్రయత్నాలకు సమాజమంతా అండగా నిలవాలి. ఈ సంవత్సరం బడ్జెట్ లోనే ప్రభుత్వం దళిత బంధు అమలు కోసం నిధులు మంజూరు చేసింది. రేపటి  నుంచి ఈ పథకాన్నిమన రాష్ట్రంలోని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద   సంపూర్ణంగా అమలుచేస్తుంది. రాష్ట్రం లోని మిగతా నియోజక వర్గాలలో పాక్షికం గా అమలు చేస్తుంది.  గత ప్రభుత్వాలు దళితులకు అందించిన చిన్న చిన్న రుణాలు, సబ్సిడీలు వంటి అరరకొర సహాయాలతో  వారిలోని ఆర్తి తీరలేదు. వారి పరిస్థితిలో గణనీయమైన మార్పు రాలేదు.   అందుకే దళితబంధు కింద యూనిట్ పెట్టుకోవడానికి కుటుంబానికి  10 లక్షల రూపాయల ఆర్థిక ప్రేరణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దళితబంధు ఆర్థిక సహాయాన్ని లబ్దిదారుని పేరున ఉన్న ఖాతాలోకి ప్రభుత్వం నేరుగా జమచేస్తుంది.  బ్యాంకులతో సంబందం లేకుండా, తిరిగి చెల్లించే భారం లేకుండా 10 లక్షల రూపాయలను పూర్తిగా గ్రాంటు రూపంలో అందజేస్తుంది. దీంతో లబ్దిదారుడికి వాయిదాలు చెల్లించాలనే ఆందోళన ఉండదు.  ప్రశాంతంగా తన జీవనోపాధిని కొనసాగించుకోగలుగుతాడు. ప్రభుత్వం అందించిన పెట్టుబడి సొమ్ముతో  ఉపాధి, వ్యాపార మార్గాన్ని ఎంచుకొనే పూర్తి స్వేచ్ఛ లభ్దిదారునికే ఉంటుందని చెప్పారు సీఎం కేసీఆర్.

రక్షణ కవచంగా దళితరక్షణ నిధి 
దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం, కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే  ఆకుటుంబం పరిస్థితి మళ్ళా తలకిందులైపోయే ప్రమాదం ఉంటుందని.. అందుకని ఆపద సమయంలో  దళితబంధు పథకం ఆ దళిత కుటుంబాన్ని ఒక రక్షక కవచంగా కాపాడాలని ప్రభుత్వం యోచించిందన్నారు. ఇందుకోసం దేశం లోనే ప్రప్రథమంగా “దళిత రక్షణ నిధి”ని ఏర్పాటు  చేసిందని.. ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వం ఇచ్చే 10 లక్షల రూపాయలలో 10 వేల రూపాయలు లబ్దిదారుని వాటా కింద జమ చేసుకొని దానికి మరో 10 వేల రూపాయలు ప్రభుత్వం కలిపి దళిత రక్షణ నిధిని నిల్వ చేస్తుందన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణ నిధి నిధి నుండి వారికి ఆర్థిక మద్దతు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని.. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దళిత బంధు సమితులను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ సమితుల నేతృత్శంలో నిధిని నిర్వహించటం జరుగుతుందన్న సీఎం.. దళితబంధు అమలు, దళితరక్షణ నిధి పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్లు  కీలక భూమిక పోషిస్తారన్నారు.  దళిత బంధు ద్వారా లబ్దిదారులు పొందుతున్న ఫలితాలను పర్యవేక్షించడం కోసం తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేకమైన పటిష్టమైన విధానం రూపొందించిందన్నారు. దళిత బంధు ద్వారా లబ్ధిపొందిన లబ్ధిదారులకు  ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇస్తుందని. . అందులో ప్రత్యేక చిప్ ను అమర్చి, ఆచిప్ సహాయంతో ఫలితాలను పర్యవేక్షిస్తుందన్నారు.  దళిత బంధు పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఇతర పథకాలు అన్నీ ఎప్పట్లాగానే అందుతాయని.. రేషన్ కార్డు ద్వారా బియ్యం, పింఛన్లు, ఇతర సౌకర్యాలు అన్నీ యథాతధంగా ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుందని.. అనేక ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందన్నారు.  ఆశించిన గమ్యం లక్ష్యం చేరుకోవాలంటే వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఉండాలన్నారు.  ఈ మూడింటి మేళవింపుతో తెలంగాణా  ప్రభుత్వం ప్రజాభ్యుదయ పథంలో మునుముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రజలకు  హామీ ఇస్తూ, యావత్ రాష్ట్ర ప్రజానీకానికి మరోసారి భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు సీఎం కేసీఆర్.