హుజూరాబాద్‌లో 16 నుంచి దళిత బంధు

హుజూరాబాద్‌లో 16 నుంచి దళిత బంధు

హైదరాబాద్​, వెలుగు: హుజూరాబాద్‌లో ఈ నెల 16 నుంచి దళిత బంధు పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని, ఇందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని కేబినెట్‌ ఆదేశించింది. ఈ పథకం అమలు, విధివిధానాల రూపకల్పనపై కేబినెట్‌ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. దళిత బంధుకు చట్టబద్ధత కల్పించడానికి చట్టం తీసుకురావాలని కేబినెట్‌ అభిప్రాయపడింది. ఎస్సీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌కు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఖర్చు చేయకుంటే క్యారీ ఫార్వర్డ్‌ చేసే విధానం తెచ్చామని, దళితబంధు దేశానికే దారిచూపే పథకం అవుతుందని పేర్కొంది. రెక్కల కష్టం తప్ప మరే ఆస్తిలేని దీనస్థితిలో దళితులు ఉన్నారని, రాష్ట్ర జనాభాలో 20 శాతం ఉన్న దళితుల చేతుల్లో కేవలం 13 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, పేదరికానికి ఇంతకుమించి గీటురాయి లేదని సీఎం కేసీఆర్​ అన్నారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా ఎస్సీలు దయనీయ స్థితిలో ఉన్నారని చెప్పారు. దళిత బంధు లబ్ధిదారులు గ్రూప్‌‌గా ఏర్పడి పెద్ద పెట్టుబడితో ఒకే యూనిట్‌‌ పెట్టుకోవడానికి అనుమతి ఇస్తామన్నారు. ఉపాధి, వ్యాపార మార్గాలు ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు ఎంచుకున్న రంగాల్లో ట్రైనింగ్‌‌ ఇస్తామన్నారు. 
సెంటర్‌‌ ఫర్‌‌ దళిత్‌‌ ఎంటర్‌‌ప్రైజెస్‌‌
దళిత బంధు స్కీం అమలులో కలెక్టర్‌‌, జిల్లా మంత్రి కీలక పాత్ర పోషిస్తారని, దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘సెంటర్‌‌ ఫర్‌‌ దళిత్‌‌ ఎంటర్‌‌ప్రైజెస్‌‌’ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. దళితబంధు లబ్ధిదారులకు అందజేసే కార్డు నమూనాలను కేబినెట్‌‌ సమావేశంలో పరిశీలించారు. ఈ కార్డు ఆన్‌‌లైన్‌‌తో అనుసంధానం చేసి లబ్ధిదారుడి పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని చెప్పారు. దళితవాడల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాలు కల్పించాలని ఇందుకు నిధుల కొరత లేదని సీఎం తెలిపారు. మిషన్‌‌ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయని, చెరువుల కింద సాగు పెరిగిందని చెప్పారు. రాష్ట్ర ఆదాయంలో 20 శాతం వ్యవసాయమే సమకూరుస్తోందని తెలిపారు. 
ఎర్రబెల్లికి సీఎం అభినందనీయులు
పల్లె ప్రగతితో గ్రామీణుల జీవితం ఆహ్లాదకరంగా మారిందని సీఎం అన్నారు.  గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేయడానికి గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ దోహద పడిందన్నారు.  దేశంలోనే అత్యధిక గొర్రెలు రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు.  గీత కార్మికులకు బీమా కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. చేనేత, గీత కార్మికుల బీమా అమలు విధానంపై త్వరలో స్పష్టత తేవాలన్నారు.