ఎన్నికలుంటేనే కేసీఆర్ వరాలు

ఎన్నికలుంటేనే కేసీఆర్ వరాలు

ఓట్ల కోసమే దళిత బంధు: షర్మిల 
జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/ఏటూరునాగారం, వెలుగు: ‘‘ఎలక్షన్లు ఎక్కడుంటే, అక్కడ్నే కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వరాలిస్తడు. హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లో దళితుల ఓట్ల కోసమే దళిత బంధు తీసుకొచ్చిండు. ఎన్నికలు అయిపోయినంక దళితులను గాలికి వదిలేస్తడు” అని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం ములుగు జిల్లాలో ఆమె పోడు యాత్ర నిర్వహించారు. గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో పర్యటించారు. ముందుగా పస్రాలో కొమ్రం భీమ్ విగ్రహానికి నివాళులర్పించి.. 5 కిలోమీటర్లు నడిచి, లింగాలలో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూముల వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘2019 ఎన్నికలప్పుడు గిరిజనుల ఓట్ల కోసం పోడు భూములకు పట్టాలిస్తానని కేసీఆర్ ప్రకటించారు. అవసరమైతే తానే స్వయంగా జిల్లాలు తిరిగి, కుర్చీ వేసుకొని మరీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మరి ఆ హామీ ఏమైంది” అని నిలదీశారు. ‘‘ఇగ ఇప్పుడు హుజూరాబాద్ లో ఎన్నికలు ఉండడంతో కేసీఆర్ దళితుల దగ్గరికి కాళ్లబేరానికి వచ్చారు. ఓట్ల కోసం దళిత బంధు అంటూ నాటకాలు ఆడుతున్నారు. గిరిజనులను మోసం చేసినట్లే, ఎన్నికల తర్వాత దళితులనూ మోసం చేస్తారు” అని అన్నారు. ఎన్నికలుంటేనే కేసీఆర్ కు ప్రజలు గుర్తొస్తారని విమర్శించారు. 
కేసీఆర్.. ఆవు తోలు కప్పుకున్న తోడేలు 
‘‘ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం వరకు ప్రతిచోటా గిరిజనులను ఫారెస్టోళ్లు వేధిస్తున్నారు. ఇదంతా చూస్తూ కేసీఆర్ ఫౌంహౌస్ లో సంబుర పడుతున్నడు. ఆదివాసీల భూములు లాక్కోని, వాటిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్ర చేస్తుండు. అందుకే గిరిజనులను అరెస్టు చేయిస్తుండు” అని షర్మిల ఆరోపించారు. కేసీఆర్.. ఆవు తోలు కప్పుకున్న తోడేలు అని విమర్శించారు. ‘‘కేసీఆర్ ది అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం. పోడు భూముల సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఆయన‌‌‌‌కు లేదు. అందుకే ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌లో కాస్తు కాలం ఎత్తివేశారు” అని అన్నారు. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలివ్వాలని, గిరిజనులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.