దళిత బంధు మరింత లేటు.. ట్రైనింగులు, క్యాంపులంటూ సర్కార్​ సాగదీత

దళిత బంధు మరింత లేటు.. ట్రైనింగులు, క్యాంపులంటూ సర్కార్​ సాగదీత
  • ట్రైనింగులు, క్యాంపులంటూ సర్కార్​ సాగదీత
  • బిజినెస్​పై పూర్తి అవగాహన వచ్చాకే ఇస్తామంటున్న అధికారులు
  • హుజూరాబాద్​లో ఇప్పటిదాకా 220 మందికే యూనిట్​ గ్రౌండింగ్​
  • కేసీఆర్​ దత్తత గ్రామం వాసాలమర్రిలో 50 మందికే
  • 4 ఎస్సీ నియోజకవర్గాల్లోని 4 మండలాల ముచ్చటే లేదు
  • ప్రతి నియోజకవర్గంలోనూ అమలుపై గైడ్​లైన్స్​ మాటే లేదు  

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో దళితబంధు మరింత లేటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్​ ఉప ఎన్నిక టైంలో పథకాన్ని అప్పటికప్పుడు అమలు చేస్తున్నామంటూ ప్రకటించిన సర్కారు.. ఇప్పుడు ట్రైనింగులు, క్యాంపులంటూ ఆలస్యం చేస్తోంది. లబ్ధిదారులకు యూనిట్లు, వ్యాపారంపై పూర్తి అవగాహన వచ్చాకే డబ్బులను అందిస్తామని అంటోంది. హుజూరాబాద్​లో కొద్ది మందికే డబ్బులందగా.. సీఎం కేసీఆర్​ దత్తత గ్రామం వాసాలమర్రిలోనూ ఇంకా పూర్తి కాలేదు. నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో ఎంపిక ప్రక్రియ ఊసే ఎత్తట్లేదు. రాష్ట్రమంతటా ప్రతి నియోజకవర్గంలో వంద మందికి పథకాన్ని అమలు చేసే విషయంలో గైడ్​లైన్స్​ ముచ్చట్నే లేకుండా పోయింది.  
జస్ట్​ జమ చేసిన్రంతే..
హుజూరాబాద్​ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సర్కారు దళితబంధు పథకాన్ని ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పథకాన్ని ప్రకటించామంటూ కేసీఆర్​ చెప్పారు. పథకంలో భాగంగా ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. హుజూరాబాద్​ను పైలెట్​ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఆ నియోజకవర్గం పరిధిలో 18,064 మంది ఎస్సీలను గుర్తించి.. రూ.2 వేల కోట్లు కేటాయించింది. లబ్ధిదారుల పేరిట ఖాతాలనూ తెరిచి డబ్బులూ జమ చేసింది. అయితే, బిజినెస్​ గ్రౌండింగ్​ను మాత్రం చేయలేదు. దీంతో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులున్నా.. వ్యాపారాలను మొదలుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పథకం.. ఓటర్లపై ప్రభావం చూపొచ్చన్న కారణంతో గ్రౌండింగ్​ చేయకుండా ఎన్నికలకు 10 రోజుల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు పెట్టింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నవంబర్​ 4 నుంచి అందరికీ దళితబంధును అందిస్తామని సీఎం కేసీఆర్​ స్వయంగా ప్రకటించారు. కానీ, రెండు నెలలవుతున్నా ఇప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు.  
ట్రైనింగులంటూ లేటు
లబ్ధిదారులకు చేసే బిజినెస్​పై అవగాహన ఉండి ఉండాలని, దాని కోసం వారికి ట్రైనింగ్​ ఇస్తున్నామని అధికారులు చెప్తున్నారు. అదంతా పూర్తయ్యాకే గ్రౌండింగ్​ చేస్తామని అంటున్నారు. అయితే, ఇప్పటికే ఎన్నో మీటింగ్​లు జరిగాక మళ్లీ ట్రైనింగ్​లేంటంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. హుజూరాబాద్​ బైపోల్​ ముగిసిన తర్వాత ఈ రెండు నెలల్లో ట్రైనింగ్​లు పెట్టి 150 మందికి మాత్రమే అధికారులు గ్రౌండింగ్​ చేశారు. మొత్తంగా 220 మందికి గ్రౌండింగ్​ పూర్తి చేశారు. ఇంత స్లోగా గ్రౌండింగ్​ చేస్తూ పోతే 18 వేల మందికి ఎప్పుడిస్తరని లబ్ధిదారులు నిలదీస్తున్నారు. ఇక, ఇటు సీఎం కేసీఆర్​ దత్తత గ్రామమైన వాసాలమర్రిలోనూ గ్రౌండింగ్​ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. వాస్తవానికి హుజూరాబాద్​ను పైలెట్​ ప్రాజెక్టుగా ప్రకటించినా.. ఆ తర్వాత యాదాద్రి జిల్లా వాసాలమర్రికి మార్చారు. ఊర్లోని 76 మంది అకౌంట్లలో డబ్బులేశారు. అందులో ఇప్పటిదాకా కేవలం 50 మందికే గ్రౌండింగ్​ అయింది. అయితే, లబ్ధిదారులు తక్కువ మంది ఉన్న దగ్గర కూడా అందరికీ గ్రౌండింగ్​ చేయకుండా ఎందుకు లేట్​ చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  
రాష్ట్రమంతా ఎప్పుడయ్యేనో?
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ దళితబంధు అమలు చేయాలనీ నెల క్రితం సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే, తొలుత నియోజకవర్గంలో వంద మందికి మాత్రమే ఇస్తామని చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలోపే అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, హుజూరాబాద్​, వాసాలమర్రితో పాటు ఎస్సీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లోని ఎస్సీలందరికీ ఇస్తామని చెప్పడంతో పెద్దగా సమస్యరాలేదు. కానీ, రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల పరిధిలో కేవలం 100 మందికే ఇస్తామని చెప్పడంతో.. ఎట్లిస్తరు? లబ్ధిదారులను ఎట్ల ఎంపిక చేయాలి? అన్న దానిపై స్పష్టత లేదు. దానికోసం ప్రత్యేకంగా గైడ్​లైన్స్​ రూపొందించాల్సి ఉన్నా.. ఇప్పటికీ దానిపై చర్చగానీ, సమీక్షగానీ జరగలేదు. ఈ నేపథ్యంలోనే గైడ్​లైన్స్​ ఎప్పుడు రూపొందిస్తరు? అప్లికేషన్లు ఎప్పుడు తీసుకుంటరు? లబ్ధిదారులను ఎప్పుడు, ఎట్లా గుర్తిస్తరు? ఫైనల్​ లిస్టును ఎప్పట్లోగా సిద్ధం చేస్తరు? యూనిట్లను ఎప్పుడు గ్రౌండింగ్​ చేస్తరు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  
ఆ నాలుగు మండలాల్లో ఎంపిక సప్పుడు లేదు..
హుజూరాబాద్​, వాసాలమర్రితోపాటు రాష్ట్రంలోని నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో దళిత బంధు స్కీం అమలు చేస్తామని నిరుడు సెప్టెంబర్​ మొదటి వారంలో సీఎం కేసీఆర్​ ప్రకటించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరికి రూ.50 కోట్లు, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకానికి రూ.100 కోట్లు, నాగర్​ కర్నూల్​ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండకు రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్​ నియోజకవర్గంలోని నిజాం సాగర్​కు రూ.50 కోట్లు ఇస్తామని చెప్పారు. ప్రకటించి నాలుగు నెలలవుతున్నా ఇప్పటికీ స్కీం అమలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం ఎంపిక ప్రక్రియ ప్రారంభించలేదు. ఎంతమంది ఉంటరు? ఎట్ల చేయాలి? లాంటి వివరాలనూ తీసుకోలేదు. ఇటీవలే ఆయా జిల్లాల కలెక్టర్ల అకౌంట్​లో రూ.250 కోట్లు మాత్రం జమ చేశారు. 

ఇవీ కేసీఆర్​ ప్రకటనలు
దళితబంధును అమలు చేసి తీరుతామని సీఎం కేసీఆర్​ చాలా సందర్భాల్లో ప్రకటన చేశారు. ‘‘దళితబంధు రాష్ట్రమంతటా అమలు చేస్తం. మార్చిలోపు దళితబంధు అమలు చేస్తం. ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి ఇస్తం. లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే. వచ్చే బడ్జెట్​లో దళితబంధు కోసం రూ.20 వేల కోట్లు కేటాయిస్తం’’ అని అక్టోబర్​ 5న ఆయన ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్​ 20న కూడా దళితబంధుపై సీఎం కేసీఆర్​ ప్రకటన చేశారు. ‘‘దళిత బంధు అమలును ఎన్ని రోజులు ఆపుతరు? నవంబర్​ 4వ తేదీ నుంచి హుజూరాబాద్​లో దళితబంధును అమలు చేస్తం. ఈసీ చిన్న ఆటంకం కలిగించింది. ఈ కార్యక్రమం ఎలాంటి ఆటంకాల్లేకుండా కొనసాగుతుంది’’ అని చెప్పారు. నవంబర్​ 4 నుంచి అమలు చేస్తామన్నా.. అది ముందుకుపడలేదు. నవంబర్​ 8న సీఎం కేసీఆర్​ మరోసారి ప్రకటన చేశారు. ‘‘దళిత బంధు పథకాన్ని అమలు చేసి తీరుతం. ఇందులో ఏ అనుమానాలూ అవసరం లేదు. హుజూరాబాద్​ నియోజకవర్గంలో పథకాన్ని అమలు చేస్తాం’’ అని స్పష్టం చేశారు.