ఆగ‌స్టు 15వ తేదీలోగా  ద‌ళిత బంధు స్కీం అమలు చేయాలి

ఆగ‌స్టు 15వ తేదీలోగా  ద‌ళిత బంధు స్కీం అమలు చేయాలి

ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని హుజురాబాద్‌లో ఆగ‌స్టు 15వ తేదీలోగా అమ‌లు చేసి తీరాల్సిందేని  MRPS వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆగస్ట్ 16 త‌ర్వాత రాష్ట్రంలోని మిగతా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇవ్వాల‌ని.. లేదంటే కేసీఆర్ మాట‌ల‌ని న‌మ్మ‌బోమ‌ని తేల్చి చెప్పారు. డెడ్‌లైన్‌లోగా కేసీఆర్ అలా చేయ‌క‌పోతే.. అంబేద్కర్ విగ్రహం కాళ్ల‌ దగ్గరికి వచ్చి మోసం చేశానని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాట తప్పితే ఈ సారి వ‌దిలేది లేదని .. ఇంటికో రూపాయి చందా వేసుకుని అయినా మంచి నటులతో ఆయ‌న చేసిన మోసంపై సినిమా తీస్తామంటూ హెచ్చ‌రించారు.

ద‌ళితులకు ఇచ్చిన హామీల‌ను కేసీఆర్ ఏనాడు అమ‌లు చేయ‌లేద‌ని.. ఆయ‌న‌పై త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌ని విమ‌ర్శించారు మంద‌కృష్ణ‌. ఏడేళ్ల కాలంలో ఒక్క దళిత అధికారిని కూడా  CMOలో ఉండనివ్వ‌లేద‌ని ఆరోపించారు. మొదటి చీఫ్ సెక్రెటరీ, డీజీపీలు అగ్రకులస్తులు కాబట్టి గౌరవమర్యాదలు, రిటైర్మెంట్ త‌ర్వాత‌ పదవులు ఇచ్చారని గుర్తు చేసిన ఆయ‌న‌.. అలాంటి క్యాడర్‌కే చెందిన ద‌ళిత అధికారుల‌కు స‌న్మానాలు ఎందుకు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే.. మంత్రుల విషయంలో తెలంగాణ‌లో దారుణ‌మైన ప‌రిస్థితి ఉంద‌న్నారు. అక్కడ ఐదుగురు ఉంటే ఇక్కడ ఒక్కరే ఉన్నార‌ని గుర్తు చేశారు. మొదటి సీఎం దళితుడు అని మాట మార్చార‌ని.. ఇక డిప్యూటీ సీఎం ఊసే ఎత్త‌డం లేద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ద‌ళిత బంధు అమ‌లుపై.. ఆగస్ట్ 1 నుంచి 5 తేదీవరకు ప్రతి రోజు ఒక జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వ‌హిస్తామ‌ని మంద‌కృష్ణ తెలిపారు. 6వ తేదీ నుంచి కలెక్టరేట్ల‌ దగ్గర ధర్నాలు. ఆ తర్వాత మండల కార్యాలయాల్లో నిర‌స‌న‌లు చేపట్టనున్నట్లు తెలిపారు. అప్ప‌టికీ ప్ర‌క‌ట‌న రాక‌పోతే ఆగ‌స్టు 16 నుంచి సెప్టెంబర్ 4 వరకు పాదయాత్ర నిర్వ‌హించి.. చివరి రోజు హుజురాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ మోసాన్ని ప్రజలకు తెలియజేస్తామని హెచ్చ‌రించారు మంద‌కృష్ణ‌.