ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కేటీ దొడ్డి, వెలుగు:  లబ్ధిదారుడికి దళితబంధు కింద వచ్చిన ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ను గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు.  బాధితుడి వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండల పరిధిలోని యర్శన్ దొడ్డి గ్రామానికి చెందిన జమ్మప్పకు ఐదు నెలల కింద దళిత బంధు ఫస్ట్ ఫేజ్‌‌‌‌ కింద ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ వచ్చింది.  శనివారం రాత్రి ఇంటి ముందు పార్క్ చేసి ఉంచగా.. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఇంజన్ భాగం మొత్తం కాలిపోయింది. ఇతరులు ట్రాక్టర్ ట్రాలీ అడిగితే ఇవ్వలేదని, వాళ్లే తగులబెట్టి ఉంటారని బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు.   పోలీసులకు ఫిర్యాదు చేశానని,  ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కు రిజిస్ట్రేషన్ కాకపోవటంతో ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం లేకుండా పోయిందని వాపోయాడు. 

రైతును రాజుగా చూడాలన్నదే సర్కారు లక్ష్యం

వనపర్తి, వెలుగు:   రైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం వనపర్తి మార్కెట్ యార్డు కొత్త కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను పూలమాలలతో సత్కరించి మాట్లాడారు.  దేశంలో ఎక్కడ లేనివిధంగా రైతుబంధు,  రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంట్‌‌‌‌, పంటల కొనుగోలుతో రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు.  కొత్త ప్రాజెక్టుల కారణంగా ఎనిమిదేళ్లలో కోటి ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయన్నారు. వనపర్తికి దేశంలోనే అతిపెద్ద మార్కెట్‌‌‌‌గా పేరుందని, కొత్త  కమిటీ  రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు. నేడు జిల్లాలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌‌‌‌  పర్యటించనున్నారని తెలిపారు. జేఎన్టీయూ కాలేజీ, ఓయూలో పీజీ కాలేజీ భవనం, ఐటీఐ కాలేజీ ,  జేఎన్టీయూ వసతి గృహానికి శంకుస్థాపనతో పాటు  బీసీ రెసిడెన్షియల్ మహిళ వ్యవసాయ డిగ్రీ కాలేజీ ప్రారంభించనున్నారని చెప్పారు.  పెద్దగూడెం క్రాస్ రోడ్డు వద్ద బహిరంగ సభ ఉంటుందని సక్సెస్ చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో  మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ బాలీశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

గృహ ప్రవేశానికి హాజరైన మంత్రి  

ఖిల్లాఘన​పూర్​ మండలం షాపురం గ్రామంలో ఆంజేయులు,సువర్ణ దంపతుల నూతన గృహప్రవేశానికి ఆదివారం మంత్రి నిరంజన్‌‌‌‌ రెడ్డి హాజరయ్యారు.  పూజా కార్యక్రమాల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవోదయ యూత్​ అసోసియేషన్​ నాయకులు దండుగల మల్లేశ్, తలారి రమేశ్, అల్లె అశోక్​, వినోద్​, ప్రవీణ్, ఎల్లప్ప రమేశ్,  మహేశ్ పాల్గొన్నారు. 

నిర్బంధాలతో సమ్మెను ఆపలేరు

మక్తల్, వెలుగు:  మిషన్​ భగీరథ కార్మికులు చేపట్టిన సమ్మెను నిర్బంధాలతో ఆపలేరని ఐఎఫ్​టీయూ జిల్లా ప్రెసిడెంట్​ కిరణ్​,  భగీరథ కాంట్రాక్ట్‌‌‌‌ కార్మికుల జిల్లా అధ్యక్షుడు అంజనేయులు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని అంతరాష్ట్ర రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మె చేస్తున్న కార్మికులను పనిలో నుంచి తొలగిస్తున్నట్టు మెగా కంపెనీ నోటీసులు జారీ చేయడం చట్ట విరుద్ధమన్నారు. ప్రభుత్వం ఒక్కో కార్మికునికి రూ .18 వేలు ఇస్తుంటే..  మెగా కంపెనీ మాత్రం రూ 10, 950 మాత్రమే చెల్లిస్తోందన్నారు. కార్మికులతో వెట్టిచారికి చేయిస్తోందని ఈఎస్ఐ, గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. లైన్‌‌‌‌మెన్లకు పెట్రోల్ అలవెన్స్ ఇవ్వడం లేదని,  వచ్చే జీతంలో రూ.3.5 వేలు పెట్రోల్‌‌‌‌కే పోతున్నాయని వాపోయారు. తమ  డిమాండ్లు  పరిష్కరించకపోతే  ఎస్‌‌‌‌ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి  రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు  భగవంతు, పీడీఎస్‌‌‌‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్, రాష్ట్ర నాయకులు సంధ్య,  మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఈశ్వరయ్య  మద్దతు తెలిపారు.  నాయకులు సత్యనారాయణ, రమేష్ రావు, లక్ష్మణ్ రావు, మనివర్ధన్ రెడ్డి, బ్రహ్మనందం, శ్రీనివాసులు శెట్టి,  రవికుమార్,  వెంకటయ్య, రవి ప్రసాద్, సాబేర్, మారెప్ప, మహేశ్, రాజు పాల్గొన్నారు.

అమ్మ ప్రేమ వెలకట్టలేనిది

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జన్మనిచ్చిన అమ్మ ప్రేమ వెలకట్టలేనిదని ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు.  ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సింగిల్ విండో మీటింగ్ హాల్‌‌‌‌లో  నిర్వహించిన ‘అమ్మ స్మారక పురస్కారం’ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ పేరిట పురస్కారం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.  కులం, మతం లేని సమాజం రావాలని, సమాజ మార్పుకు దోహదం చేసినప్పుడే మనిషి తనానికి సార్థకత లభిస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత గోపాల్, అవార్డు గ్రహీత కవి యాకూబ్, ఎదిరేపల్లి కాశన్న, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కుమార్, ఐద్వా రాష్ట్ర నాయకులు గీత, బలరాం,  దినకర్, మోహన్, రాములు తదితరులు పాల్గొన్నారు. 

హామీల అమలులో సర్కారు ఫెయిల్

పానగల్, వెలుగు:  హామీల అమలులో సర్కారు ఫెయిల్ అయ్యిందని బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు  ఎల్లేని సుధాకర్ రావు విమర్శించారు.  పాదయాత్రలో భాగంగా ఆదివారం పానగల్ మండలం చింతకుంట నుంచి దొండాయిపల్లి, అన్నారం,  అన్నారం తండా,  గోపులాపూర్ వరకు నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అభివృద్ధిని మరిచారని, గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.   మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు 19 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా  నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు.  వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే  నిరుద్యోగుల కోసం పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే నియోజకవర్గం నుంచి తనను తరిమేయాలని ప్రజలను కోరారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అన్వేష్, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి రోజా రమణి, ప్రధాన కార్యదర్శి రమేశ్,  శ్రీనివాస్ యాదవ్, భరత్ చంద్ర, ఆదిత్య రెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.

పీయూలో త్వరలో ఇంజనీరింగ్, లా కోర్సులు

మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు:  పాలమూరు యూనివర్సిటీలో త్వరలో ఇంజనీరింగ్​, లా కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ తెలిపారు.  జిల్లా కేంద్రంలోని పీయూలో ఆదివారం మధ్యాహ్నం  ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి పీయూ గెస్ట్ హౌస్ వరకు రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, రూ.70 లక్షలతో చేపట్టిన   క్యాంటీన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం  మీడియాతో మాట్లాడుతూ పీయూలో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని,  ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఫ్యూచర్​లో  పెద్ద మొత్తంలో ఫండ్స్ తీసుకొచ్చి, నంబర్​ వన్ ​యూనివర్సిటీగా తీర్చిదిద్దుతానన్నారు. పీయూ సమీపంలోనే కొత్త కోర్టు కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నామని, బండమీదపల్లి మీదుగా కోస్గి బైపాస్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో  అటు హన్వాడ ఫుడ్ పార్క్, ఇటు ఐటీ పార్కుకు బండమీదపల్లి సెంటర్ పాయింట్ అవుతుందన్నారు.  అనంతరం జిల్లా పరిషత్ మీటింగ్‌‌‌‌లో హాల్‌‌‌‌లో 387 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్, రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ గిరిజ మంగతాయారు పాల్గొన్నారు.