వెన్నుపోటుతోనే బీఆర్ఎస్ కు సీట్లు పెరిగినయ్ : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వెన్నుపోటుతోనే  బీఆర్ఎస్ కు  సీట్లు పెరిగినయ్ : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గంలో పార్టీలోని కొందరు సీనియర్​ నాయకులు వెన్నుపోటుతోనే బీఆర్ఎస్​  మద్దతుతో పోటీ చేసిన సర్పంచులు గెలిచారని, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై ఏఐసీసీ, పీసీసీ, క్రమశిక్షణ సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలో మీడియాతో మాట్లాడారు. 

కాంగ్రెస్  మద్దతు తెలిపిన అభ్యర్థుల తరపున తాము ప్రచారం చేస్తే, ఒక సీనియర్  నాయకుడు బీఆర్ఎస్​ మద్దతుదారులను గెలిపించమని చెప్పడంతోనే ఏళ్ల నుంచి కాంగ్రెస్  జెండా మోసిన కార్యకర్తలకు నష్టం జరిగిందన్నారు. 50 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే వారు వెన్నుపోటు పొడవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు, ఎంపీ ఎన్నికల్లో మల్లు రవికి వ్యతిరేకంగా పని చేసినా పార్టీ సీనియారిటీని గౌరవించిందని ఇంత కన్నా ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. 

వనపర్తి నియోజకవర్గంలోని 141 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగగా, 80 స్థానాలను కాంగ్రెస్​ గెలుచుకుందని తెలిపారు. 50 స్థానాలను బీఆర్ఎస్, నాలుగు బీజేపీ, ఏడు స్వతంత్రులు గెలుచుకున్నారని చెప్పారు. 51 శాతం బీసీ సర్పంచులు గెలిచారని, జనరల్​ స్థానాల్లోనూ బీసీలకు అవకాశం ఇచ్చి విజయం సాధించామని తెలిపారు. బీఆర్ఎస్ కు వచ్చిన 50  స్థానాల్లో 15 నుంచి -20 స్థానాలు కాంగ్రెస్  మద్దతుదారులు గెలిచే అవకాశం ఉన్నా, వెన్నుపోటు రాజకీయాలతో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

పార్టీకి విధేయులుగా ఉంటూ జెండా మోసిన కార్యకర్తలను టార్గెట్  చేయడం సరైంది కాదన్నారు. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ, హైకమాండ్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. వనపర్తి, పెబ్బేరు ఏఎంసీ చైర్మన్లు శ్రీనివాస్ గౌడ్,  ప్రమోదిని రెడ్డి, పీసీసీ సభ్యుడు శంకర్  ప్రసాద్, మున్సిపల్  మాజీ చైర్మన్  మహేశ్, రహీం, ఎస్ఎల్ఎన్​ రమేశ్​ పాల్గొన్నారు.