దారుణం: దళిత విద్యార్థితో టాయిలెట్స్ కడిగించారు

దారుణం: దళిత విద్యార్థితో టాయిలెట్స్ కడిగించారు

చదువుకోవడానికి పాఠశాలకు వెళితే విద్యార్థులచేత నిర్దాక్షిణ్యంగా మరుగుదొడ్లు కడిగిస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు. సిబ్బంది లేరనో.. విసర్జన తర్వాత వాటర్ పోయలేదనో..తప్పు చేశాడని పనిష్మెంట్ గానో.. ఇలా ఏదో కారణం చేత విద్యార్థులచేత టాయిలెట్లు కడిగిస్తు్న్నారు టీచర్లు. ఇటీవల కర్నాటకలోని ఓ ప్రభుత్వ స్కూల్లో టీచర్లు.. దళిత విద్యార్థి చేత టాయిలెట్లు కడిగించడం దుమారం రేపుతోంది. విద్యార్థి మరుగుదొడ్లు కడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య తీవ్ర అసంసతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలకు ఆదోశించారు.వివరాల్లోకి వెళితే.. 

బెంగళూరులోని ఆండ్రహళ్లి  ప్రభుత్వ మోడల్ హయ్యర్, ప్రైమరీ స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీదేవమ్మ  6వ తరగతి విద్యార్థుల చేత యాసిడ్ తో టాయిలెట్లు శుభ్రం చేయిస్తున్నారని ఆరోపిస్తూ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు  పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. 

ఈ విషయంపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందిస్తూ విద్యార్థుల చేత మరుగుదొడ్లు శుభ్రం చేయిడం సహించరాని చర్య అన్నారు. ఇటీవల కాలంలో పాఠశాల్లో విద్యార్థుల చేత  టాయిలెట్లు శుభ్రం చేయిస్తున్నారని చాలా ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలపై నిఘా ఉంచాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని ఆదేశించామన్నారు. ప్రతి పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రిని ఆదేశించామన్నారు. ఈ అంశంపై జిల్లా విద్యాధికారులు సర్వే నిర్వహించి నివేదికలు  తీసుకోవాలని ఆదేశించామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. 

విద్యార్థుల చేత టాయిలెట్లు కడిగించిన సంఘటనలు ఒక్క డిసెంబర్ నెలలోనే మూడు చోట్ల వెలుగులోకి వచ్చాయి. డిసెంబర్ 1 న కోలార్ జిల్లాలోని మలూరు తాలూకాలోని యలువహళ్లి మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్ జరిగింది. దళిత విద్యార్థులను సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయాలని పాఠశాల అధికారులు బలవంతం చేశారు. శిక్షగా సెప్టిక్ ట్యాంక్ లోకి దిగి దానిని శుభ్రం చేయమని ఆదేశిస్తున్నట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడంతో పాఠశాల డైరెక్టర్ నవీన్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపాల్ భారతమ్మ, ఉపాధ్యాయుడు మునియప్ప, హాస్టల్ వార్డెన్ మంజూనాథ్, అతిథి ఉపాధ్యాయుడు  అభిషేక్ లను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.