గైడ్​ లైన్స్​ లేకుండానే  దళిత బంధు

గైడ్​ లైన్స్​ లేకుండానే  దళిత బంధు
  • రేపటి సభలో 15 మందికే చెక్కులు ఇవ్వనున్న సీఎం
  • అర్హుల పేర్లు రాసుకోవటం లేదని హుజూరాబాద్ లో ఆందోళనలు
  • అందరికీ ఇవ్వకుంటే దీక్షకు కూర్చుంటానన్న ఈటల
  • ప్రజలను బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారన్న హరీశ్

హైదరాబాద్/కరీంనగర్​, వెలుగు: దళిత బంధు పథకం ప్రారంభానికి ముందే ప్రభుత్వానికి  చిక్కులు తెచ్చి పెట్టింది. అర్హుల గుర్తింపునకు సరైన విధి విధానాలేవీ ప్రకటించకపోవటం గందరగోళానికి తెర లేపింది. పేదలను జాబితాలో చేర్చటం లేదని, పలుకుబడి ఉన్నోళ్లనే చేరుస్తున్నారంటూ  హుజూరాబాద్​ నియోజకవర్గంలోని దళితులు వరుసగా రెండో రోజూ ఆందోళనలకు దిగారు.  హుటాహుటిన కరీంనగర్​ వెళ్లిన మంత్రి హరీశ్​రావు, సీఎస్​ సోమేశ్​ కుమార్​ అక్కడ జిల్లా కలెక్టర్​తో పాటు ఆఫీసర్లతో రివ్యూ చేశారు. సోమవారం జరిగే బహిరంగ సభా వేదికపై సీఎం కేసీఆర్​ 15 మంది  తొలి లబ్ధిదారులకు దళిత బంధు చెక్కులను పంపిణీ చేస్తారని ఆయన ప్రకటించారు. దీంతో  అసలు తమకు చెక్కులు వస్తాయా.. లేదా.. అని నియోజకవర్గంలోని దళిత కుటుంబాల్లో ఆందోళన  మొదలైంది. ఇదిలా ఉంటే.. హుజూరాబాద్​ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు సాయం అందించాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్​ డిమాండ్​ చేశారు. అందరికీ అందించక పోతే తాను దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఎవరూ చెప్పుడు మాటలు వినొద్దని, ప్రతి కుటుంబానికి దళిత బంధు అందిస్తామని మంత్రి హరీశ్​రావు అన్నారు. బీజేపీ, కొన్ని సంఘాల నాయకులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని,  అపోహలుసృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. అర్హులందరికీ ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందని సీఎస్​ సోమేశ్​ కుమార్​ చెప్పారు. ఇది పైలట్ ప్రాజెక్టు కాబట్టి సమస్యలు వస్తే పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.

అర్హుల ఎంపికపై క్లారిటీ లేదు
దళిత బంధు కొత్త స్కీమ్​ కావటంతో అర్హుల ఎంపిక ఎలా జరుగుతుందనే విషయంలో ఇప్పటికీ స్పష్టత కరువైంది. అర్హుల ఎంపిక, లబ్ధిదారులకు నిధుల విడుదలపై స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయలేదు.  దీంతో రూ.10 లక్షల పంపిణీ ఎప్పుడు జరుగుతుంది..? అనే సందేహాలు తలెత్తాయి. ముందుగా కొందరికిస్తే.. తర్వాత తమ వంతు ఎప్పుడు వస్తుందో.. అసలు రాకుండా పోతుందేమోననే ఆందోళన దళిత కుటుంబాలను వెంటాడుతోంది. హుజూరాబాద్​ నియోజకవర్గంలోని మొత్తం 21 వేల దళిత కుటుంబాలకు ఈ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని.. ఈ ఒక్క నియోజకవర్గానికి రూ. 2,000 కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. కానీ, ఇటీవల రూ. 500 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో అన్ని కుటుంబాలకు సాయం అందదని,  కేవలం 5 వేల కుటుంబాలను మొట్టమొదటగా ఎంపిక చేయనున్నట్లు లెక్కతేలింది. ఇదే టైమ్​లో సర్వే టీమ్​లను పంపించి అర్హుల జాబితాలను తయారు చేయించటం అయోమయానికి తావిచ్చింది. ఆఫీసర్లు తోచిన పేర్లను రాసుకుంటున్నారని, అర్హుల పేర్లను రాసుకోవటం లేదంటూ పలుచోట్ల దళితులు ఆందోళనకు దిగారు.

రెండో రోజూ ఆందోళనలు
దళిత బంధు అర్హుల జాబితాలో తమ పేరు ఎందుకు చేర్చడం లేదని హుజూరాబాద్​ నియోజకవర్గంలో శనివారం రెండో రోజూ దళితులు ఆందోళనకు దిగారు. అనర్హులను, పలుకుబడి ఉన్నోళ్లను, టీఆర్​ఎస్​ లీడర్లకు దగ్గరోళ్లనే లిస్టులో చేరుస్తున్నారని మండిపడ్డారు. ఇల్లందకుంట తహసీల్దార్​ ఆఫీసుకు దళితులు తమ కుటుంబాలతో వచ్చి.. ఆఫీసు ఎదుట డప్పు కొట్టి నిరసన తెలిపారు. హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లిలో అనర్హులకు స్కీంను కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్-–- వరంగల్ జాతీయ రహదారిపై  దళితులు రాస్తారోకో చేపట్టారు. ఇప్పల నర్సింగాపూర్ గ్రామస్తులు హుజూరాబాద్ టౌన్ లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కందుగల గ్రామ దళిత మహిళలు కూడా నిరసన చేపట్టారు.

రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో 100 రోజుల్లో ఎలాంటి షరతులు లేకుండా దళిత బంధు ఇవ్వాలని రామగుండం కార్పొరేషన్​ఎదుట షెడ్యూల్డ్​ కులాల సమగ్ర అభివృద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో శనివారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్​లో ఎస్సీల సమగ్ర అభివృద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు డప్పులు కొడుతూ ర్యాలీ తీశారు.

పైరవీలు షురూ.. లీకైన ఆడియో
దళితబంధు పైరవీలు షురూ అయ్యాయి. లోకల్​ లీడర్లు బేరసారాలకు దిగుతున్నారు. డబ్బులు రావాలంటే ఎంతో కొంత ఇవ్వాల్సిందిగా హుజూరాబాద్​ నియోజక వర్గం కమలాపూర్‌లోని దళిత ఫ్యామిలీతో ఓ మహిళా నేత భర్త మాట్లాడిన ఆడియో శుక్రవారం రాత్రి లీక్ అయింది. ‘‘దండం పెడ్త.. సగం పైసలు తీస్కో కానీ నాకు దళితబంధు వచ్చేటట్లు చెయ్’’ అంటూ ఆ వ్యక్తి అడిగారు. దీనికి ‘‘సగం పైసలు నేనెందుకు తీస్కుంటగానీ.. లక్షో రెండు లక్షలో ఖర్చయితయ్​” అని ఆ నేత అన్నారు.