దళితులకు లాభం చేకూర్చే వరకూ కేసీఆర్ వదిలిపెట్టరు

దళితులకు లాభం చేకూర్చే వరకూ కేసీఆర్ వదిలిపెట్టరు

సంగారెడ్డి: రైతు బంధుతోపాటు ఇతర పథకాల మాదిరే దళిత బంధు కూడా అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గీతం యూనివర్శిటీలో జరుగుతున్న " కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ " ఓరియంటేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.  విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులు సంధించిన ప్రశ్నలకు ఆయన ఉదాహరణలతో సహా జవాబిచ్చారు. దళిత బంధు ఇప్పుడే ఎందుకు ప్రకటించారు? ఈ పథకం క్షేత్ర స్థాయిలో సక్సెస్ అవుతుందా? అని సినీ నటి పూనమ్ కౌర్ ప్రశ్నించారు. కేటీఆర్ బదులిస్తూ రైతు బంధుతో పాటు ఇతర పథకాల లాగా ఇది కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. రైతు బంధు పెట్టినప్పుడు కూడా అనుమానాలు వ్యక్తం చేశారని, అయితే ఇప్పుడు 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దళిత కుటుంబాలకి లాభం చేకూర్చే వరకు కేసీఆర్ వదిలిపెట్టరని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదని ఆయన స్పష్టం చేశారు.
 

తెలంగాణ వచ్చినప్పుడు చాలా అనుమానాలు ఉన్నాయని, తెలంగాణలో శాంతి భద్రతలు కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దేశంలో మహబూబ్ నగర్, అనంతపురం జిల్లాలలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగేవని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వస్తే కరెంటే ఉండదని ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెబితే తాము అధికారంలోకి వచ్చి 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని  గుర్తు చేశారు. 24 గంటలకు కరెంటు ఇస్తున్న  ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అన్నారు. అలాగే దేశంలో ఒక్క తెలంగాణ లోనే ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తున్నామన్నారు.

తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు

తెలంగాణ ప్రభుత్వ ట్యాగ్ లైన్ నీల్లు, నిధులు, నియామకాలు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలో నే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టామని, గతంలో వర్షాలు, బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు దేశంలోనే అత్యధికముగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం గుర్తించిందన్నారు. రైతు బంధు కోసం రెండు సీజన్లలో కలిపి 62 లక్షలు మంది రైతులకు 15 లక్షలు కోట్లు ఇస్తున్నామన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అడవులు 23 శాతం ఉంటే హరిత హారం ద్వారా ఇప్ప్పుడు 28 శాతానికి పెరిగాయన్నారు. ఏడేళ్లుగా సవాళ్లు ను అధిగమంచి పని చేస్తున్నామని, 75 ఏళ్ల స్వాతంత్రంలో దళితులు వివక్షకి గురవుతున్నారని, తెలంగాణ జనాభా లో 17 శాతం దళితులు ఉన్నారని, అందుకే వారికి దళిత బంధు ఇస్తే  దళితులు ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ప్లాస్టిక్ వాడొద్దు అంటున్న కేంద్రం ప్రత్యామ్నాయం చూపించాలి

ప్లాస్టిక్ వాడొద్దు అని కేంద్రం చెబుతోందని, కేంద్రం సూచనను స్వాగతిస్తామని అంటూనే ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఐదు వేల సంవత్సరాలలో జరిగిన పట్టణీకరణ 50 ఏళ్లలోనే జరగుతోందన్నారు. జనాభా పెరుగుతున్నందున పట్టణీకరణ అనివార్యం అని ఆయన పేర్కొన్నారు. విభజన వలన రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని, పార్టీలో కార్యకర్తగా కెరీర్ మొదలు పెట్టి నేడు మంత్రిగా పని చేస్తున్నాననని ఆయన తెలిపారు.