దళితబంధు కమీషన్లు వెనక్కి ఇవ్వండి.. దళితుల ధర్నా

దళితబంధు కమీషన్లు వెనక్కి ఇవ్వండి.. దళితుల ధర్నా
  • మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫామ్​హౌస్​ ముందు దళితుల ధర్నా
  • దళితబంధు ఇప్పిస్తానని పైసలు తీస్కొని మోసం చేసిండని ఫైర్
  • 62 మంది వద్ద లక్ష చొప్పున కమీషన్​ తీసుకున్నాడని ఆరోపణ

జనగామ, వెలుగు: జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫాంహౌస్​ ముందు పలువురు దళితులు ధర్నా చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న టైంలో దళితబంధు ఇప్పిస్తానని తమ వద్ద డబ్బులు తీసుకున్నాడని, ఆ డబ్బులు తిరిగివ్వాలని వారు డిమాండ్​ చేశారు. ఈ మేరకు శుక్రవారం నర్మెట మండలం హన్మంతాపూర్​లోని ముత్తిరెడ్డి ఫాం హౌస్​​ముందు బాధితులు నిరసన తెలిపారు. మద్దూరు, దూల్మిట్ట మండలాలకు చెందిన బాధితులు అక్కడి ఎంపీపీ బద్దిపడగ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. దళితుల సంక్షేమం కోసం కేసీఆర్​ దళితబంధు పథకం ప్రవేశ పెడితే.. లబ్ధిదారుల ఎంపికకు ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష చొప్పున 62 మంది వద్ద ముత్తిరెడ్డి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆ స్కీంకు ఎంపిక చేయనందున ఇచ్చిన కమీషన్​ డబ్బుల్ని తిరిగివ్వాలని బాధితులు ఎన్నిపార్లు అడిగినా ఆయన పట్టించుకోవడం లేదన్నారు. ముత్తిరెడ్డి ఫాం హౌస్​​కు వస్తున్నాడని తెలిసి ఇక్కడికి వచ్చామని, అయినా ఆయన అందుబాటులో లేరని అన్నారు. రెండుమూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం లభించక పోతే హైదరాబాద్​ లోని ముత్తిరెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. 

నాపై రాజకీయ కుట్ర : ముత్తిరెడ్డి 

అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగినట్లుగానే మళ్లీ ఎంపీ ఎన్నికల ముందు తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. మద్దూరు ఎంపీపీ కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు అబద్ధమని, దీనిపై డీజీపీ సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరారు. గతంలో మద్దూరు, దూల్మిట్టలో కృష్ణా రెడ్డి వసూళ్లకు పాల్పడితే ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని ప్రెస్​మీట్​ పెట్టి హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ దీనిపై దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్ని కుట్రలు చేసినా జనగామ ప్రజలకు తానేంటో తెలుసని, కుట్రలకు తెరపడే రోజు వస్తుందని ఆయన పేర్కొన్నారు.