- పనులు పూర్తి అయితే వచ్చే మహాజాతర నాటికి జీవనదిగా మారనున్న జంపన్నవాగు
- ఆనందంలో జిల్లావాసులు, భక్తులు
- వర్షాకాలంలో వరద సమస్య లేకుండా చూడాలంటున్న స్థానికులు
ములుగు, వెలుగు : ములుగు జిల్లా మేడారంలోని జంపన్న వాగు త్వరలోనే నిత్యప్రవాహినిగా మారనుంది. మేడారంలో ఇటీవల నిర్వహించిన కేబినెట్ భేటిలో పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు నిధులు విడుదల చేయడం, రామప్ప, లక్నవరం అనుసంధానం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో జంపన్నవాగు జీవనదిగా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతరకు వచ్చే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు నుంచి జంపన్నవాగులోకి నీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం అమలైతే జంపన్నవాగులో నిత్యం నీరు పారుతుందని స్థానికులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రామప్ప, లక్నవరం సదస్సుల అనుసంధానానికి గ్రీన్‌సిగ్నల్
ఈ నెల 18న మేడారం వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడే కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గోదావరి జలాలతో స్థానికంగా ఉన్న 30 చెరువులు నింపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ ఆఫీసర్లను ఆదేశించడంతో పాటు ములుగు మండలం పొట్లాపూర్ వద్ద రూ.143 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు పర్మిషన్ ఇచ్చారు.
దీంతో పొట్లాపూర్, పత్తిపల్లి, మదనపల్లి, దేవగిరిపట్నం, ఇంచర్ల తదితర గ్రామాల పరిధిలోని 7,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. కేబినెట్ మీటింగ్ అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ... రామప్ప, లక్నవరం సరస్సుల అనుసంధానానికి సైతం గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ పనులు పూర్తి అయితే జంపన్న వాగు నిండు కుండగా మారనుంది.
వర్షాకాలంలో వరదలు రాకుండా చూడాలంటున్న స్థానికులు
వర్షాకాలంలో ములుగు జిల్లా వ్యాప్తంగా వరదల తీవ్రత ఎక్కుగా ఉంటుంది. అటవీ ప్రాంతం గుండా వచ్చే నీరంతా గుండ్లవాగు, లక్నవరం వరద కాల్వల నుంచి వచ్చి జంపన్నవాగులో కలుస్తుంది. రెండేండ్ల కింద భారీ వర్షాలు వచ్చి పలు చెరువులకు గండ్లు పడడం, రామప్ప సరస్సు బ్యాక్ వాటర్ కారణంగా హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి.
తాడ్వాయి, పస్రా మధ్యలోని జలగలంచ బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ స్థాయిలో వచ్చిన వరద తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల పరిధిలోని ప్రాజెక్ట్‌నగర్, నార్లాపూర్, మేడారం పరిసరాలను ముంచెత్తడంతో పలువురు చనిపోయారు.
జంపన్న వాగు వరద ఓ దశలో మేడారంలో అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుంది. ప్రస్తుతం రామప్ప, లక్నవరం సరస్సుల అనుసంధానంతో జంపన్నవాగులో నిత్యం నీటి ప్రవాహం ఉండేలా చేస్తే.. వర్షాకాలంలో వరద ఉధృతిని తట్టుకునేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
