మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి : కమిషనర్ రాణి కుముదిని

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి : కమిషనర్ రాణి కుముదిని
  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

జనగామ అర్బన్/ కాశీబుగ్గ, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని స్థాయిల్లో పూర్తి సన్నద్ధతతో ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహణకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. నామినేషన్లు స్వీకరించే కేంద్రాల్లో గోడ గడియారం ఏర్పాటు చేయడంతో పాటు, నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఆర్‌వోలు, ఏఆర్‌వోల నియామకాలు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. వంద శాతం బ్యాలెట్ బాక్స్​లు సిద్ధంగా ఉండాలని, పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలను ముందుగానే పరిశీలించాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. ఈ వీసీల్లో వరంగల్, జనగామ కలెక్టర్లు సత్య శారత, రిజ్వాన్​ భాషా షేక్​ పాల్గొని జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఏర్పాట్ల ప్రక్రియపై ఎన్నికల అధికారికి వివరించారు.