
మధిర, వెలుగు: సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా దండి సురేశ్, జిల్లా సహాయ కార్యదర్శిగా జమ్ముల జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. మధిరలో జరిగిన జిల్లా మహాసభలలో ఈ ఎన్నిక జరిగింది. మహాసభలలో 91 మంది కౌన్సిల్ ను, 29 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురానికి చెందిన దండి సురేశ్, విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ లో కీలకంగా పని చేశారు. తర్వాత ఏఐవైఎఫ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. సహాయ కార్యదర్శిగా ఎన్నికైన జితేందర్ రెడ్డి చింతకాని మండలం నాగలికొండకు చెందినవారు.
వీరిద్దరి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని పార్టీ వెల్లడించింది. కొత్తగా ఎన్నికైన నేతలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పార్టీ నేత భాగం హేమంత్ రావు తదితరులు అభినందనలు తెలిపారు. అంతకుముందు జరిగిన సమావేశంలో వందేళ్ల సుదీర్ఘ పోరాటాల స్ఫూర్తితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు నిరంతరం కృషి చేయాలనిబాగం హేమంతరావు పిలుపునిచ్చారు.