విండీస్‌తో డేంజరే!

విండీస్‌తో డేంజరే!

గ్యారీ సోబర్స్‌‌, వివ్‌‌ రిచర్డ్స్‌‌,  గార్డెన్‌‌ గ్రీనిడ్జ్‌‌, డెస్మండ్‌‌ హేన్స్‌‌, బ్రియాన్‌‌ లారా.. ఇలా చెప్పుకుంటే పోతే వెస్టిండీస్‌‌ నుంచి వచ్చిన గొప్ప క్రికెటర్ల పేర్లకు లెక్కే ఉండదు. వరల్డ్‌‌కప్‌‌లో  రెండు సార్లు విజేతగా, ఓ సారి రన్నరప్‌‌గా నిలిచిన ఘనత విండీస్‌‌ సొంతం. అలాంటి జట్టు  బోర్డు, ఆటగాళ్ల మధ్య  విభేదాల వల్ల కొంతకాలం క్రికెట్‌‌ ప్రపంచంలో ఉనికి కోసం పోరాడింది. క్వాలిఫయర్‌‌ ఆడి వరల్డ్‌‌కప్‌‌కు ఎంపికైన విండీస్‌‌ ఈసారి పవర్‌‌గేమ్‌‌ను నమ్ముకుని బరిలోకి దిగుతోంది. మెగా టోర్నీలో సెమీస్‌‌పై కన్నేసిన వెస్టిండీస్‌‌ను ప్రత్యర్థులు లైట్‌‌ తీసుకుంటే మొదటికే మోసం వచ్చే చాన్సుంది.

బౌలర్లకు నేనంటే భయం…..

ప్రత్యర్థి జట్ల బౌలర్లకు నేనంటే ఇప్పటికీ భయమేనన్నాడు క్రిస్ గేల్. కానీ కెమెరాల ముందు వారు ఆ విషయాన్ని ఒప్పుకోరు. ఆఫ్‌‌ ది కెమెరా అడిగితే యూనివర్సల్​ బాస్‌‌ అంటే ఏమిటో చెబుతారు. నా ఆధిపత్యాన్ని వాళ్లు దైర్యంగా ఒప్పుకోలేరు. యూనివర్సల్​ బాస్​  సత్తా ఏమిటో అందరికీ తెలుసు. ఫాస్ట్‌‌ బౌలర్లను ఎదుర్కోవడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా. ఐపీఎల్‌‌లో పెద్దగా పరుగులు చేయలేకపోయాను కానీ  టచ్‌‌లోనే ఉన్నా. వరల్డ్‌‌కప్‌‌ ముందు ఆడే వామప్‌‌ మ్యాచ్‌‌లను పూర్తిగా ఉపయోగించుకుంటా.

వెస్టిండీస్‌‌తో మ్యాచ్‌‌ అంటే ఒకప్పుడు ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. ముఖ్యంగా ఆ జట్టు బౌలర్లను ఎదుర్కొనేందుకు బ్యాట్స్‌‌మెన్‌‌ భయపడిపోయేవారు. దాదాపు 20 ఏళ్లు క్రికెట్‌‌ ప్రపంచాన్ని ఏలిన విండీస్‌‌1975, 79ల్లో జరిగిన తొలి రెండు వరల్డ్‌‌కప్‌‌ టోర్నీల్లో విజేతగా నిలిచింది.1983లో కపిల్‌‌సేన చేతిలో ఓడి రన్నరప్‌‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత  క్రమంగా ప్రతిష్టను మసకబార్చుకుంది. అది ఏస్థాయిలో అంటే ఈసారి వరల్డ్‌‌కప్‌‌ ఆడడానికి ఏకంగా క్వాలిఫయింగ్‌‌ టోర్నీ ఆడాల్సిన స్థితికి వచ్చింది.  అక్కడ కూడా ఫైనల్లో అఫ్గానిస్థాన్‌‌ చేతిలో ఓడిపోయింది. బోర్డుతో విబేధాల కారణంగా చాలామంది ఆటగాళ్లు జాతీయ జట్టును వదిలేసి టీ20లీగ్‌‌లకు మొగ్గు చూపారు. ప్రస్తుతానికి పరిస్థితి కొద్దిగా సద్దుమణిగి  టీ20 ఫార్మాట్‌‌లో విండీస్‌‌ తిరుగులేని జట్టుగా ఎదిగినా వన్డేల్లో మాత్రం తంటాలు పడుతూనే ఉంది. 2014 తర్వాత ఆ జట్టు ఒక్క వన్డే సిరీస్‌‌లో కూడా విజయం సాధించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జేసన్‌‌ హోల్డర్‌‌ నాయకత్వంలోని జట్టు ఈసారి మెగా టోర్నీలో అండర్‌‌డాగ్‌‌గా బరిలోకి దిగుతుంది. అయితే  గేల్‌‌, రసెల్‌‌, షై హోప్‌‌ లాంటి విధ్వంసకర ఆటగాళ్లతో నిండిన విండీస్‌‌ను ఇంగ్లండ్‌‌లోని చిన్న గ్రౌండ్‌‌ల్లో అడ్డుకోవడం ప్రత్యర్థులకు సవాలే.

ధనాధన్‌‌ బ్యాటింగే బలం…

పవర్‌‌గేమ్‌‌ను నమ్ముకునే విండీస్ ఈసారి బరిలోకి దిగుతోంది. క్షణాల్లో మ్యాచ్‌‌ను మార్చేసే క్రిస్‌‌గేల్‌‌, ఆండ్రీ రసెల్‌‌ లాంటి హిట్టర్లు ఆ జట్టు సొంతం. వరల్డ్‌‌కప్‌‌ తర్వాత రిటైర్మెంట్‌‌ ప్రకటించనున్న గేల్‌‌ కెరీర్‌‌కు మంచి ఫినిషింగ్‌‌ కోరుకుంటున్నాడు. దీంతో జట్టు అతనిపై భారీగా ఆశలు పెట్టుకుంది. గేల్‌‌, రసెల్‌‌కు అండగా హెట్‌‌మెయిర్‌‌, షై హోప్‌‌, ఎవిన్‌‌ లూయిస్‌‌తో బ్యాటింగ్‌‌ లైనప్‌‌ చాలా బలంగా కనిపిస్తుంది. కెప్టెన్‌‌ జేసన్‌‌ హోల్డర్‌‌, బ్రాత్‌‌వైట్‌‌ అవసరమైన ప్రతీసారి బ్యాట్‌‌తో రాణించగలరు.

బౌలింగ్‌‌లో బలహీనం….

బౌలింగ్‌‌లో కరీబియన్‌‌ టీమ్‌‌ చాలా కాలంగా బలహీనంగా ఉంది. ఇందుకు ఆ జట్టు సాధించిన ఫలితాలే నిదర్శనం.  జేసన్‌‌ హోల్డర్‌‌, కీమర్‌‌ రోచ్‌‌ ప్రధాన బౌలర్లు కాగా ఇంగ్లండ్‌‌ వాతావరణంలో మీడియం పేసర్‌‌ రసెల్‌‌ కీలకం కానున్నాడు. బ్రాత్‌‌వైట్‌‌తోపాటు లెఫ్టార్మ్​ పేసర్‌‌ కోట్రెల్‌‌ అండగా ఉన్నారు. ఇంగ్లండ్‌‌లోని  ఫ్లాట్‌‌ వికెట్ల మీద జరగనున్న మెగా టోర్నీకి మణికట్టు స్పిన్నర్‌‌ లేకుండానే ఆడనుంది. స్పిన్నర్‌‌ ఆష్లే నర్స్‌‌కు కొంత అనుభవమున్నా అది చాలకపోవచ్చు.  కెరీర్‌‌లో ఇప్పటిదాకా ఏడు వన్డేలే ఆడిన లెఫ్టామ్‌‌ స్పిన్నర్‌‌ అలెన్‌‌ నుంచి ఎక్కువ ఆశించడం అత్యాశే అవుతుంది. బౌలర్లు  జట్టును ఎంత దూరం తీసుకెళ్తారో చూడాల్సిందే.

పోటీనివ్వడం ఖాయం….

పేపర్‌‌ మీద బలంగానే కనిపిస్తున్న విండీస్‌‌ జట్టు అంచనాలను అందుకుంటే ప్రత్యర్థులకు చెమటలు పట్టడం ఖాయం. అయితే మణికట్టు స్పిన్నర్‌‌ లేకపోవడం వారికి లోటు. పేసర్లే దానిని భర్తీ చేయాల్సి ఉంది. గేల్‌‌, లూయిస్‌‌, రసెల్‌‌, కీమర్‌‌ రోచ్‌‌ లాంటి ప్రధాన ఆటగాళ్ల ఫిట్‌‌నెస్‌‌ కాపాడుకోవడం జట్టు ముందు ఉన్న అతి పెద్ద సవాల్‌‌. ఆటగాళ్లంతా స్థాయికి తగ్గట్టుగా రాణిస్తే వెస్టిండీస్‌‌ను సెమీఫైనల్లో చూడొచ్చు.