ఈతకు వెళ్లి కవలలు మృతి ..కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లిలో ఘటన

ఈతకు వెళ్లి కవలలు మృతి ..కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లిలో ఘటన

కామారెడ్డిటౌన్, వెలుగు: ఈత  కోసం వెళ్లి కుంటలో మునిగిన కవలలు చనిపోయారు. దేవునిపల్లి ఎస్సై బి.రంజిత్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం తిమ్మక్​పల్లి గ్రామానికి చెందిన గుర్రాల పెద్ద నర్సింలు, మంజుల దంపతులకు రాము(13), లక్ష్మణ్(13) అనే కవల పిల్లలు ఉన్నారు. వీరిద్దరు జడ్పీ హైస్కూల్​లో 8వ తరగతి చదువుతున్నారు. 

సోమవారం స్కూల్​కు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చిన రాము, లక్ష్మణ్​ ఆడుకొని వస్తామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి రాత్రయినా తిరిగి రాలేదు. వారి కోసం వెతుకుతుండగా రాత్రి 11.30 గంటల తరువాత కుంట ఒడ్డున వీరి బట్టలు కనిపించాయి. విషయం తెలుసుకొని దేవునిపల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

 కుంటలో గాలించగా ఒకరి డెడ్​బాడీ బయటపడింది. మంగళవారం ఉదయం మరో డెడ్​బాడీ దొరికింది. కవల పిల్లలు కుంటలో మునిగి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.