మళ్లీ మొండిచెయ్యి.. సెమీ కండక్టర్ ప్లాంట్ల ఏర్పాటులోనూ తెలంగాణపై కేంద్రం వివక్ష

మళ్లీ మొండిచెయ్యి.. సెమీ కండక్టర్ ప్లాంట్ల ఏర్పాటులోనూ తెలంగాణపై కేంద్రం వివక్ష
  • రాష్ట్ర సర్కార్ ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోని కేంద్రం
  • ఏపీలో మాత్రం ప్లాంట్‌‌ ఏర్పాటుకు ఆమోదం 
  • మెట్రో విషయంలోనూ అదే తీరు.. ఫేజ్‌‌ 2పై కొర్రీలు 
  • ఇప్పటికే ఏపీ, ఇప్పుడు లక్నో మెట్రో ప్రాజెక్టులకేమో గ్రీన్‌‌ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి కేంద్రం మళ్లీ మొండిచెయ్యి చూపించింది.  పరిశ్రమల ఏర్పాటు విషయంలోనూ వివక్ష చూపిస్తున్నది. కూటమి ప్రభుత్వం ఉన్న ఏపీకి మాత్రం వరాల జల్లు కురిపిస్తున్నది. ఇప్పటికే ఏపీ మెట్రోకు ఆమోదం తెలిపి, మన మెట్రోను పెండింగ్‌‌‌‌లో పెట్టిన కేంద్రం.. ఇప్పుడు సెమీకండక్టర్ ప్లాంట్ల విషయంలోనూ అదే తీరుగా వ్యవహరించింది. రాష్ట్రంలో సెమీకండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ ఎప్పటినుంచో కోరుతున్నా పెడచెవిన పెట్టింది. ఏపీలో మాత్రం సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఏపీతో పాటు ఒడిశా, పంజాబ్‌‌‌‌లో రూ.4,594 కోట్ల విలువైన సెమీకండక్టర్ ప్రాజెక్టులకు గ్రీన్‌‌‌‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణకు కేంద్రం ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 

నాడే కోరిన రాష్ట్ర ప్రభుత్వం..
నిరుడు అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన వరల్డ్ ​టెలికమ్యూనికేషన్స్​ స్టాండర్డైజేషన్​అసెంబ్లీలో.. రాష్ట్రానికి మూడు సెమీకండక్టర్ యూనిట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నాడు ఆ మీటింగ్‌‌లో పాల్గొన్న మంత్రి శ్రీధర్​బాబు.. సెమీకండక్టర్ల రంగానికి సంబంధించి అడ్వాన్స్‌‌డ్‌‌​ప్యాకేజింగ్ అండ్​మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్​(ఏపీఎంపీ), అసెంబ్లీ టెస్టింగ్​ మేకింగ్​ప్యాకేజింగ్​(ఏటీఎంపీ) యూనిట్లను నెలకొల్పాలని కేంద్రాన్ని కోరారు. ఇండియన్​సెమీకండక్టర్​మిషన్​(ఐఎస్ఎం)లో భాగంగా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సుమారు రూ.1,800 కోట్ల వ్యయం అవుతుందని, అందులో కేంద్రం రూ.700 కోట్లు పెట్టుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. అంతేకాదు.. ఢిల్లీకి వెళ్లిన పలు సందర్భాల్లోనూ సెమీకండక్టర్​రంగానికి తెలంగాణ చాలా అనుకూలంగా ఉందని, సహకారం అందించాలని సీఎం రేవంత్​, మంత్రి శ్రీధర్​బాబు కేంద్రానికి విజ్ఞప్తులు ఇచ్చి వచ్చారు.

కానీ, మన ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్రం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం ఒక్క యూనిట్​ఏర్పాటుకైనా ఓకే చెప్పలేదు. కేంద్రం ఒప్పుకోకపోయినా ఫ్యూచర్​సిటీలో భాగంగా సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఓ జోన్‌‌ను కేటాయించేందుకు యోచిస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన మూడు నాలుగు సంస్థలు సెమీకండక్టర్ల ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. సింగపూర్‌‌‌‌కు చెందిన అసోసియేషన్​ఆఫ్​సెమీకండక్టర్స్, పీటీడబ్ల్యూలు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిని కనబరిచాయి. మరికొన్ని కంపెనీలూ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిని చూపించాయి. కేంద్రం మాత్రం ఆ దిశగా రాష్ట్రానికి సహకారం అందించేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. 

మెట్రో ఫేజ్2 పైనా అదే ధోరణి..
మెట్రో ప్రాజెక్టు విషయంలోనూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తున్నది. మెట్రో ఫేజ్‌‌ 2 కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రతిపాదనలు పంపగా, దానికి ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు. ఏపీలో మాత్రం రూ.21,600 కోట్లతో మెట్రో నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో నిర్మించేందుకు గ్రీన్‌‌ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ మెట్రోకు రూ.10,118 కోట్లు, వైజాగ్​మెట్రోకు రూ.11,498 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా.. ఈ రెండు ప్రాజెక్టులకూ 50 శాతం నిధులు అందిస్తామని కేంద్రం తెలిపింది. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్‌‌లోని లక్నో మెట్రోకూ ఆమోదం తెలిపింది. రూ.5,801 కోట్లతో లక్నో మెట్రో ఫేజ్​1బీని నిర్మించేందుకు ఓకే చెప్పింది.

కానీ, హైదరాబాద్​మెట్రో సెకండ్​ఫేజ్‌‌కు సాయం చేయండని అడిగితే మాత్రం కేంద్రం పట్టించుకోవడం లేదు. మన మెట్రో నిర్మాణంలో కేంద్రం భరించాల్సింది 18 శాతమే అయినా ఒక్క పైసా కూడా ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. రకరకాల కొర్రీలు పెడుతూ అడుగడుగునా మెట్రోను ముంగటపడకుండా చేస్తున్నది. అంచనా వ్యయం భారీగా పెరిగిందని, పీక్​అవర్​ట్రాఫిక్​తక్కువగా ఉందని చెబుతూ అడ్డం పడుతున్నది. ఫేజ్​ 2లో కేటగిరి ఏ కింద రూ.24,269 కోట్లు, కేటగిరి బీ కింద రూ.19,579 కోట్లు అవుతాయని రాష్ట్ర సర్కారు అంచనా వేస్తున్నది. అందులో 18 శాతం లెక్కన మనకు కేవలం రూ.7,892 కోట్లే కేంద్రం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ, దానికి కేంద్రం ససేమిరా అంటున్నది.