నవరాత్రి ఉత్సవాలు.. బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నిత్యం అమ్మవారిని పూలతో పూజించి బతుకమ్మలు పేర్చి గౌరమ్మదేవిని వివిధ రూపాల్లో పూలతో పూజిస్తారు. అయితే అమ్మవారిని పూలతో పూజించేటప్పుడు కొన్ని నియమాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!
దసరా నవరాత్రి ఉత్సవాలో అమ్మవారిని పూలతో అలంకరించి .. పుష్పాలు సమర్పిస్తూ పూజలు చేయడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. అయితే అమ్మవారిని పుష్పాలు సమర్పంచేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
అమ్మవారి పూజ కోసం తాజాగా శుభ్రంగా ఉండే పూలను మాత్రమే ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితిలో రెక్కలను విడదీయకూడదు. వాడిపోయిన, ఎండిపోయిన, పురుగులతో ఉండిన, నేలపై రాలిపోయిన పువ్వులను పూజలో ఉపయోగించకూడదు. ఇలాంటి పూలను ఉపయోగించడం వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అయితే పారిజాతం చెట్టు కింద శుభ్రమైన వస్త్రాన్ని వేసి పూలు రాల్చి వాటితో మాత్రమే పూస చేయాలి. ఎట్టి పరిస్థితిలో చెట్టునుంచి పూలు కోయకూడదని పురాణాల ద్వారా తెలుస్తుంది.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పూజకు పూలు కోసేముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. అంతే కాదు భగవన్నామ స్మరణ చేస్తూ పూలు కోయాలి. పూలను కోసేందుకు స్టీలు గిన్నెలు వాడకూడదు. అలా కోసిన పూలను శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి.
దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఎరుపు, పసుపు రంగు పుష్పాలను అమ్మవారి పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. మందార, చంపా, మల్లె వంటి పుష్పాలను కూడా పూజలో సమర్పిస్తారు. అమ్మవారికి పూల దండ సమర్పించే టప్పుడు దారానికి పసుపురాసి ఆ దారాన్ని ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితిలో తెల్ల దారాన్ని వాడకూడదని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా పూజలో ఉపయోగించే పుష్పాలు తాజాగా, శుభ్రంగా ఉండటంతో పాటు భక్తిశ్రద్ధలతో సమర్పించడం అత్యంత ముఖ్యమైనది. నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తితో ఆరాధిస్తూ, తమ సంప్రదాయానికి అనుగుణంగా పుష్పాలు సమర్పిస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
