హీరో నాని రీసెంట్ గా నటించిన దసరా సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది. నాని ఇప్పటివరకు నటించిన సినిమాలన్నింటికంటే దసరా పెద్ద సినిమా కానుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాదు నానికి ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే టీజర్, పాటలు రిలీజ్ అయ్యి, మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. దసరాకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ కథానాయికగా నటించారు.
ఇక దసరా సినిమా టికెట్ బుకింగ్ విషయానికొస్తే యూఎస్ బుకింగ్ లు మార్చి 14వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి. ప్రీమియర్ అమ్మకాలు ఇప్పటికే 100 వేల డాలర్ల మార్కుకు చేరుకుని రికార్డు రేంజ్ లో దూసుకుపోతున్నాయి. దీంతో ఈ మూవీపై విపరీతమైన క్రేజ్ మొదలైంది. ఇక ఇప్పుడు దేశంలో బుకింగ్ లకు సర్వం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో దసరా బుకింగ్‌లు మార్చి 24వ తేదీ రాత్రి నుంచే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభ రోజు బుకింగ్‌లు చాలా వేగంగా, భారీగా ఉన్న ట్టు తెలుస్తోంది.
నాని సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల గ్రాస్‌ను ఈజీగా టచ్ చేస్తుందని ఆయన ఫ్యాన్స్ తో పాటు మేకర్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దసరా బుకింగ్‌లు బుక్ మై షో (Bookmyshow), పేటీఎం (Paytm) ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఏఎంబీ సినిమాస్, ఏషియన్ సినిమాస్ లాంటి మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధరలు రూ.295 గా, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ.175గా నిర్ణయించినట్టు సమాచారం.