ఫెయిల్యూర్ ప్రెసిడెంట్‌‌వి.. రాహుల్ గాంధీపైనే కామెంట్ చేస్తావా?

ఫెయిల్యూర్ ప్రెసిడెంట్‌‌వి.. రాహుల్ గాంధీపైనే కామెంట్ చేస్తావా?

హైదరాబాద్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. ఒబామా రాస్తున్న ఓ పుస్తకంలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై కామెంట్స్ చేశారు. ‘రాహుల్ గాంధీ కొంచెం నిరుత్సాహంగా కనిపిస్తారు. తన నైపుణ్యంపై ఆయన కొంత నెర్వస్‌గా ఉంటారు. పని పూర్తి చేసి టీచర్ మెప్పు పొందాలని ఒక విద్యార్థి ఎలా ఆరాటపడతారో రాహుల్ అలా కనిపిస్తారు. అయితే ప్రావీణ్యం సంపాదించాలనే తపన మాత్రం రాహుల్‌‌లో లేదు. ఆయనలో స్పష్టత, ధైర్యం కొరవడ్డాయి’ అని ది ప్రామిస్డ్ ల్యాండ్ అనే పుస్తకంలో ఒబామా రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా దాసోజు శ్రవణ్ స్పందించారు.

‘మా నాయకుడు రాహుల్ గాంధీపై మీరు కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. యూఎస్ ఫెయిల్యూర్ ప్రెసిడెంట్ నుంచి సర్టిఫికెట్లు పొందాల్సిన గత్యంతరం ఏ భారత నాయకుడికీ లేదు. ఇతరులపై బురద జల్లే బదులు అమెరికా మీద దృష్టి పెడితే మంచిది’ అని శ్రవణ్ ట్వీట్ చేశారు.