‘ఇప్పుడిప్పుడే’ కొత్తకొత్తగా ఉంది

 ‘ఇప్పుడిప్పుడే’ కొత్తకొత్తగా ఉంది

‘ఇప్పుడిప్పుడే’ దాస్యం సేనాధిపతి కవిత్వం నవనవలాడుతున్నది. పుస్తకం తెరవగానే మనకు ‘లేడీ టీచర్’ దర్శనమిస్తుంది. ఆమె మూర్తిమత్వం, సేవాతత్వం, అంకితభావం, అర్పణతత్వం సాక్షాత్కరిస్తాయి. తరువాత కొన్ని కవితలలో స్త్రీల అగచాట్లు అగుపిస్తాయి. “మెడలో వెలయాలి హారం వేసుకొని / పాశవిక మనస్తత్వాల పంకిలానికి / సంతోష పరిమళాలను గుబాళిస్తూ / గుట్టు చప్పుడు లేని బతుకునూ వెళ్లదీస్తున్నా ! / కష్టాలు హృదయ సాగరంలో సుళ్ళు తిరుగుతున్నా / బాధలను పంటి కింద దాచుకుని / ఒంటితో విటులకు వినోద హారతి పడుతున్నా!’’ అనే వేశ్య జీవితం పాఠకులను ఆర్ద్రపరుస్తుంది.

ఈ కావ్యంలోని ప్రణయ కవిత్వంలో - ఆమె అతని ఊహలకు రెక్కలు తొడిగి వలపు ఊయల లూపుతుంది. చల్లని చూపులను మల్లెల ధనువుగా మార్చి తనువెల్ల పులకరింపజేస్తుంది. పవిత్ర బంధంతో ఒక్కటై, సరాగాలతో స్వాగతం పలుకుతారు. చిరునగవులు చిగురులేసి ప్రేమ సుమాల పరిమళాలు గుబాళిస్తాయి. ఎప్పుడైనా సంసార సాగరంలో సంఘర్షణల అలలు లేస్తే, అవి చందమామను కమ్మిన మేఘాల్లా తాత్కాలికం. “నొచ్చుకున్న నీ మోములో / మళ్ళీ విచ్చుకున్న సుమంలా / నవ్వులు వెల్లివిరియాలని” ఒకరికొకరు కాంక్షిస్తారు. నా కోసం ఆనందాలను పంచే పూదోటవు నువ్వే, మన జీవన పందిరికి ప్రేమసుమాలు విరబూయిస్తున్నది నువ్వే, నా పెదవిపై ఉదయించే ప్రతి చిరునవ్వు నువ్వే, నీడలా నా వెంట ఉండి పండువెన్నెల కాంతులను వెదజల్లుతున్నదీ నువ్వే అని పరస్పరం అనుకుంటారు. 

‘ఒకరి గుండెలో ఒకరం సదా / మన మధుర జ్ఞాపకాల మువ్వలను మ్రోగిస్తూ / ఆనందాల దివ్వెలను వెలిగిద్దాం’ అన్నంత పరిపక్వ ప్రేమ వాళ్లది. స్నేహ సౌధాన్ని ఎంత ఎత్తైనా నిర్మించవచ్చని, ఒకరి భావాలను మరొకరు పంచుకోవచ్చని, అనుబంధాలను అందంగా, బలంగా మలచుకోవచ్చని, అమృత జలధిలో ఓలలాడవచ్చని వారు నిరూపిస్తారు. సేనాధిపతి ఈ కావ్యాన్ని తన సతీమణి గీతారాణికి అంకితం ఇవ్వడం విశేషం. 
 

ఇతని ‘ప్రకృతి కవిత్వం’లో సుమంపైటను లాగుతూ సయ్యాటలాడే భ్రమరం, ముళ్ళను దాచి పెడుతూ కంచెను అల్లుకునే తీగలు, పడుచుపిల్లల్లా బుగ్గలపై సిగ్గులొలుకబోసే పూ మొగ్గలు, సుప్రభాత వేళ పక్షుల స్వరహారతి, ప్రకృతి మాతకు గిలిగింతగా భానుడు చేసే సంతకం, పొద్దుతిరుగుడు పువ్వులకు ఆదిత్యుని నింగి ప్రసాదించే చినుకుపూలకు చిరుగాలి లాలిపాట తోడై తొలకరి, నేలను ఆలింగనం ఉంటాయి. ఇంకా – నింగి ప్రసాదించే చినుకుపూలకు చిరుగాలి లాలిపాట తోడై తొలకరి, నేలను స్పృశించగానే ప్రకృతి పరవశిస్తుంది.

ఇందులో సామాజికాంశాలూ ఉన్నాయి. ఇప్పుడు అనుబంధాలకు అర్థాలు మారిపోతున్నాయి. పెద్దల జీవితాలు ప్రశ్నార్థకమౌతున్నాయి. అమ్మంటే ముగింపులేని మహాకావ్యం, ఊహల కందని మూర్తిమత్వం, వర్ణన కసలే దొరకని వ్యక్తిత్వం, అక్షరాల్లో బంధించలేని అనురాగం, వెన్నెలలాంటి ప్రసన్నవదనం, నవనీతం వంటి హృదయం, అవిశ్రాంత అమాయక శ్రమజీవి. అటువంటి అమ్మ ‘‘తనయుల కుమ్ములాటల్లో నేడు మబ్బులు కమ్మిన ఆకాశం / జీవన సంధ్యలో తనవారి ఆదరణ కరువై / వృద్ధాశ్రమంలో బొమ్మై కూర్చుంది” ,“వృద్ధాప్యం ఓ శాపమై / రక్తమాంసాలే కాదు / కన్నీళ్లను సైతం లాగేసుకుంది’’ వంటి వాక్యాలు చదువు తున్నపుడు పాఠకుల కళ్లు చెమర్చుతాయి. కొన్ని ఇళ్లలో - ‘‘ఉపాధి కోసం గూడు వదిలి / రెక్కలొచ్చిన పక్షులు ఎగిరివెళ్లాక / ముసలోళ్ల కొస ప్రాణాలు దారం తెగిన గాలిపటాలైనాయి”. మరి కొన్ని ఇళ్లలో ఆధిపత్యం కోసం అత్తాకోడళ్లు పడే ఆరాటంలో మగవాళ్లు అడకత్తెరలో పోకచెక్కలౌతున్నారు. అమ్మలా.. అత్త ప్రేమను పంచితే, కోడళ్లు.. కూతుళ్లను మరిపిస్తారు.

-కొన్ని వస్తువులను కవి దర్శించిన తీరు నవ్యంగా ఉంది. తెల్ల కాగితం - అక్షర సొబగులను ఒంటికి అద్దుకుని అందరినీ ఆకర్షించే ‘అభిసారిక’. అబద్ద మసలే ఎరుగని అందమైనది ‘అద్దం’. పరిమళాలను వెదజల్లే మల్లెల గుబాళింపులతో పరవశించడమూ, అప్పుడప్పుడు కన్నీరుతో తడిసి ముద్దవడమూ తెలిసినది ‘దిండు’. కంటి కెమెరాకు చిక్కని అందమైన అనుభవాలను పంచే దృశ్యాలను హృదయమనే కాన్వాసుపై చిత్రించే మనసు, మన అంతరంగంలో ఉరకలు వేసే ఆనందానికి ప్రతిబింబమైన నవ్వు - అన్నీ కవితా వస్తువులే. మట్టికీ, మనిషికీ గల బంధాన్ని చెప్పాడు. తాత చెప్పులలోని పాదముద్రలను చూస్తూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. “మనసును గట్టున పెట్టి / మర మనుషులను తలపిస్తున్నం/ అంతర్జాల సమూహంలో ఉంటూనే / ఒంటరి వాళ్లమవుతున్నం / గుండె ద్రవించే వేళ సైతం / కన్నీరును కార్చే పనిని / వాట్సాప్ బొమ్మకే అప్పగించి / చేతులు దులుపుకుంటున్నం / అనుభూతులకు దూరమౌతూ / కృత్రిమత్వానికి పట్టం గడుతున్నం” “జీవితం తాత్కాలిక నాటకమని తెలిసినా భ్రమలలోకంలో ఊరేగుతాం” అని కఠిన వాస్తవాల్ని మృదువుగా చెప్పాడు. ఇందులో “మానవుడు మాధవుడు కావాలి. ఆత్మీయ ఆశాలతలు అల్లుకోవాలి. మేడలన్నీ మానవత్వపు సౌధాలై సమభావనలు పంచాలి. గుడిసెలన్నీ కోవెలలై భాసించాలి” వంటి సూక్తులున్నాయి.

ఈ రచయిత గత కవితా సంపుటుల కన్నా ‘ఇప్పుడిప్పుడే’ కొత్తకొత్తగా ఉంది. ముందు ముందు సేనాధిపతి కవితలు మరింత నవనవోన్మేషంగా ప్రకాశించాలి. పుస్తకానికి కల్యాణం శ్రీనివాస్ వేసిన ముఖచిత్రంలో కవి ఆనందం ద్విగుణీకృతమౌతున్నది. అరవైలో ఇరవై వచ్చినంత సంతోషం ద్యోతకమౌతున్నది. ఇన్ని భావాలు వచ్చేలా ముఖచిత్రాన్ని గీయడం అభినందనీయం.

ఎ. గజేందర్ రెడ్డి
9848894086