కంపెనీ రాకతో డేటా వినియోగం 100 రెట్లు పైకి

కంపెనీ రాకతో డేటా వినియోగం 100 రెట్లు పైకి
  • 5జీ లాంచ్ తర్వాత 2 రెట్లు పెరుగుతుందని అంచనా
  • 95 శాతం తగ్గిన డేటా ధరలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  జియో వచ్చి నేటితో ఆరేళ్లు పూర్తవుతున్నాయి.  ఈ 6 సంవత్సరాలలో టెలికాం సెక్టార్‌‌‌‌లో నెల సగటు తలసరి డేటా వినియోగం 100 రెట్లు  పెరిగింది. ట్రాయ్ డేటా ప్రకారం, జియో రాకముందు దేశంలో  సగటు సబ్‌‌స్క్రయిబర్‌‌‌‌  ఒక నెలలో 154 ఎంబీ డేటాను మాత్రమే వినియోగించేవారు. డేటా ఖరీదు తగ్గడంతో  ఇప్పుడు డేటా వినియోగం 100 రెట్లు పెరిగి  సగటున  15.8 జీబీ స్థాయికి చేరుకుంది. మరోవైపు, జియో వినియోగదారులు ప్రతి నెలా దాదాపు 20 జీబీ డేటాను ఉపయోగిస్తున్నారు. ఈ దీపావళికి 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. 5జీ  అమల్లోకి వచ్చాక   డేటా వినియోగం మరింత పెరుగుతుందని అంచనా. 5జీని ప్రవేశపెట్టిన తర్వాత, వచ్చే మూడేళ్లలో డేటా వినియోగం 2 రెట్లు ఎక్కువ పెరుగుతుందని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ అంచనా వేసింది. ఓటీటీ వినియోగం కూడా పెరుగుతుండడంతో డేటా వినియోగం మరింత ఎక్కువవుతుందని పేర్కొంది.

తక్కువ టైమ్‌‌లోనే నెంబర్ వన్‌‌గా..

ప్రారంభమైన ఆరేళ్లలోనే  దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద టెలికం కంపెనీలలో ఒకటిగా జియో ఎదిగింది. ప్రస్తుతం దేశంలో కంపెనీ సబ్‌‌స్క్రయిబర్లు  41.30 కోట్లకు చేరుకున్నారు. జియో ఫైబర్ కస్టమర్లు   70 లక్షలకు పెరిగారు. దేశ టెలికం మార్కెట్‌‌లో కంపెనీ మార్కెట్ వాటా  36 శాతం పెరిగి, దేశంలోనే నెంబర్ వన్ టెలికం నెట్‌‌వర్క్​గా రికార్డులకు ఎక్కింది. వాయిస్ కాలింగ్ కోసం భారీ బిల్లులు చెల్లిస్తున్న ఈ దేశంలో అవుట్‌‌గోయింగ్ వాయిస్ కాల్‌‌లను ఉచితంగా చేసింది జియో. అన్ని నెట్‌‌వర్క్‌‌లలోని  వినియోగదారులకు ఇలాంటి అనుభవం  మొదటి సారి కావడం విశేషం.