చేతికి అంది వచ్చిన కూతురు.. 18 ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి.. ఆటో డ్రైవర్ అయినా ఏ లోటు లేకుండా కష్టపడి చదివించాడు ఆ తండ్రి.. అలాంటి కూతురు.. తండ్రి కళ్ల ఎదుటే.. తన కుటుంబానికి నిత్యం ఆసరా.. అండదండగా ఉంటూ పోషిస్తున్న ఆటో కిందే పడి చనిపోవటం అందర్నీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఎంతో కష్టపడి చదువుతున్న కుమార్తెను.. టెట్ ఎగ్జామ్ రాయించటానికి.. స్వయంగా తన ఆటోలో.. తానే డ్రైవ్ చేస్తూ కాలేజీకి తీసుకెళుతున్నాడు. విధి మాత్రం మరోలా రాసింది తలరాతను.. ఆటో కింద పడి.. తన కళ్ల ఎదుటే కుమార్తె చనిపోవటం ఆ తండ్రిని కుంగదీస్తుంది. ఈ విషాధ ఘటన ఏపీ రాష్ట్రం అనకాపల్లి జిల్లా సుంకరమెట్ట దగ్గర జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టెట్ ఎగ్జామ్ ఉందని పొద్దు పొద్దున్నే లేచి రెడీ అయిన కూతురుని పరీక్ష కేంద్రం వద్ద దించేందుకు తండ్రి తన సొంత ఆటోలో తీసుకెళ్లాడు. మార్గ మధ్యలో ఎగ్జామ్ సెంటర్ రూట్ కోసం గూగుల్ మ్యాప్ ఆన్ చేసి చూస్తూ ఆటో డ్రైవ్ చేస్తున్నాడు. పరీక్ష బాగా రాయాలమ్మా.. మంచి మార్కులు రావాలి.. బాగానే రాస్తావ్.. ధైర్యంగా, కాన్ఫిడెంట్ గా రాయి.. అంటూ మ్యాప్ చూస్తూ వెళ్తున్నారు.
అనకాపల్లి జిల్లా సుంకరమెట్ట దగ్గరికి చేరుకునే సరికి ఊహించని ప్రమాదం జరిగింది. తండ్రితో పాటు ముందు సీటులో కూర్చున్న కూతురు సునీత (18) ఆటో కింద పడి దుర్మరణం పాలైంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కళ్లెదుటే చనిపోవడంతో ఆ తండ్రి కూతురును పట్టుకుని ప్రాణాలు పోయేలా రోధించాడు. ఈ విషాద ఘటన చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అనకాపల్లి సుంకరమెట్ట జంక్షన్ స్పీడ్ బ్రేకర్ వద్ద తండ్రితో పాటు డ్రైవర్ సీటులో కూర్చున్న సునీత..ఆటో లో నుండి రోడ్డుపై జారి పడింది. దీంతో ఆటో సునీత పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే
చనిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవింగ్ చేస్తున్న తండ్రి లక్ష్మణరావు సురక్షితంగా బయటపడ్డాడు. కూతురు మృతుదేహాన్ని వేరే వాహనంలో ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.

