డెవిస్ కప్ లో పాక్ పై ఇండియా విజయం

డెవిస్ కప్ లో  పాక్ పై ఇండియా విజయం

నూర్‌‌ సుల్తాన్‌‌:

ఆటలో ఆద్యంతం ఆధిపత్యం చూపెట్టిన ఇండియా టెన్నిస్‌‌ టీమ్‌‌.. డేవిస్‌‌ కప్‌‌ క్వాలిఫయర్స్‌‌కు అర్హత సాధించింది. ఆసియా / ఓసియానియా గ్రూప్‌‌–1లో భాగంగా జరిగిన పోరులో ఇండియా 4–0తో పాకిస్థాన్‌‌పై గెలిచింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌‌లో వెటరన్‌‌ లియాండర్‌‌ పేస్‌‌–జీవన్‌‌ నెడుంజెళియన్‌‌ 6–1, 6–3తో పాక్‌‌ టీనేజర్‌‌ జోడీ మహ్మద్‌‌ షోయబ్‌‌–హుఫైజా అబ్దుల్‌‌ రెహమాన్‌‌పై గెలిచారు. 2014 తర్వాత డేవిస్‌‌లో అన్ని మ్యాచ్‌‌లు గెలవడం ఇండియాకు ఇదే తొలిసారి. అప్పట్లో చైనీస్‌‌తైపీపై 5–0తో నెగ్గింది. ఇక డేవిస్‌‌కప్‌‌లో పేస్‌‌కు ఇది 44వ విజయం. గతేడాది 43వ విజయంతో ఇటలీ లెజెండ్‌‌ నికోలా పిత్రాంజెలి (42 విన్స్‌‌) రికార్డును బద్దలు కొట్టిన పేస్‌‌.. ఈ గెలుపుతో మరో మెట్టు ఎక్కాడు. పిత్రాంజెలి 66 మ్యాచ్‌‌ల్లో 42 విజయాలు సాధిస్తే.. పేస్‌‌ 56 మ్యాచ్‌‌ల్లోనే 43
గెలుపులతో డేవిస్‌‌లో మోస్ట్‌‌ సక్సెస్‌‌ఫుల్‌‌ డబుల్స్‌‌
ప్లేయర్‌‌గా రికార్డులకెక్కాడు. మొత్తానికి ఇండియన్‌‌ ప్లేయర్‌‌కు 57 మ్యాచ్‌‌ల్లో 44వ గెలుపు కావడం విశేషం. ఇప్పట్లో ఈ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యం. ఎందుకంటే 36 విజయాలతో మూడో స్థానంలో ఉన్న మాక్స్‌‌ మిర్నీ (బెలారస్‌‌).. 2018 నుంచి డేవిస్‌‌ కప్‌‌లో ఆడటం లేదు. ఇక నైపుణ్యం, చురుకుదనం ఉన్న డబుల్స్‌‌ ప్లేయర్‌‌ ఒక్కరు కూడా టాప్‌‌–10లో కనిపించడం లేదు. ఓవరాల్‌‌గా డబుల్స్‌‌లో పేస్‌‌ 92–35 విన్‌‌–లాస్‌‌ రికార్డుతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 48 సింగిల్స్‌‌ విజయాలు కూడా ఉండటం గమనార్హం. ఇంకొక్క విజయం సాధిస్తే పేస్‌‌ 4వ స్థానంలో ఉన్న స్పెయిన్‌‌ ప్లేయర్‌‌ మాన్యూయెల్‌‌ సాంటానా ( 92–28)ను దాటేస్తాడు.

అనుభవంతో…

53 నిమిషాల పాటు జరిగిన డబుల్స్‌‌ పోరులో పేస్‌‌–జీవన్‌‌ ఎక్కడా తడబడలేదు. బలమైన ఫోర్‌‌హ్యాండ్‌‌ షాట్లతో రెచ్చిపోయిన పేస్‌‌ సర్వీస్‌‌లోనూ ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌‌లో సర్వీస్‌‌ను నిలబెట్టుకున్న షోయబ్‌‌–రెహమాన్‌‌.. మూడో గేమ్‌‌లో తడబడ్డారు. దీంతో పేస్‌‌ జోడీ 3–1 ఆధిక్యంలో నిలిచింది. ఐదో గేమ్‌‌లో స్కోరు 30–15 వద్ద జీవన్‌‌ డబుల్‌‌ ఫాల్ట్‌‌ చేశాడు. అయినా పాక్‌‌ జంట.. ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురాలేకపోయింది. ఫలితంగా సర్వీస్‌‌ కోల్పోవడంతో పేస్‌‌–జీవన్‌‌ ఆధిక్యం 5–1కి పెరిగింది. సెట్‌‌లో నిలవాలంటే సర్వీస్‌‌ నిలబెట్టుకోవాల్సిన స్థితిలో షోయబ్‌‌ వరుసగా పాయింట్లు కోల్పోయాడు. దీంతో 0–40తో వెనుకబడ్డాడు. ఈ దశలో పేస్‌‌–జీవన్‌‌ అద్భుతమైన రిటర్న్స్‌‌తో రెండో చాన్స్‌‌లోనే సెట్‌‌ను సొంతం చేసుకున్నారు. రెండోసెట్‌‌ ఆరంభంలో పాక్‌‌ ప్లేయర్ల సర్వీస్‌‌ను బ్రేక్‌‌ చేసే చాన్స్‌‌ వచ్చినా పేస్‌‌ ద్వయం మిస్‌‌ చేసుకుంది. దీనికితోడు షోయబ్‌‌–రెహమాన్‌‌ గట్టిగా పోరాడటంతో స్కోరు 3–3తో సమమైంది. అయితే ఏడో గేమ్‌‌లో సర్వీస్‌‌ను కాపాడుకున్న ఇండియన్‌‌ ప్లేయర్లు.. 8వ గేమ్‌‌లో పాక్‌‌ సర్వీస్‌‌ను బ్రేక్‌‌ చేసి 5–3తో ఆధిక్యంలో నిలిచారు. తర్వాతి గేమ్‌‌లో సర్వ్‌‌ చేసిన లియాండర్‌‌ సెట్‌‌తో పాటు విజయాన్ని అందించాడు.