కిక్కిరిసిన అయోధ్యాపురి ... ఒక్కరోజే 5 లక్షల మంది దర్శనం

కిక్కిరిసిన అయోధ్యాపురి ...  ఒక్కరోజే 5 లక్షల మంది దర్శనం

అయోధ్య : టెంపుల్ టౌన్ అయోధ్య జనసంద్రమైంది. రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన వేడుక తర్వాత తొలిసారి సాధారణ ప్రజలు దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా తరలివచ్చారు. దీంతో వారిని అదుపుచేయడం సెక్యూరిటీ సిబ్బంది వల్ల కాలేదు. తొలి రోజు ఏకంగా 5 లక్షల మంది దాకా భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నట్లు సమాచారం. ఇంకా వేలాది మంది రామయ్య దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక బాల రాముడి విగ్రహానికి ‘బాలక్‌‌ రామ్‌‌’గా పేరుపెట్టారు. మరోవైపు రద్దీ మధ్య జేబు దొంగలు చేతివాటం చూపారు. భక్తుల విలువైన వస్తువులు కొట్టేశారు. 

సోమవారం రాత్రి నుంచే..

సోమవారం మధ్యాహ్నం శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించిన నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచే జనం తరలివచ్చారు. చాలా మంది మెయిన్ గేట్ వద్ద రాత్రంతా పడిగాపులు కాశారు. ‘భక్తులతో ఆలయ ప్రధాన రోడ్డు మార్గమైన ‘రామ్‌‌ పథ్’ నిండిపోయింది. ఉదయం 6 గంటల నుంచి భక్తులను టెంపుల్ కాంప్లెక్స్‌‌ లోపలికి అనుమతించాం. మధ్యాహ్నం 2 గంటల కల్లా స్వామి వారిని 2.5 లక్షల మంది దర్శించుకున్నారు’ అని అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ చెప్పారు. తొలి రోజు మొత్తంగా 5 లక్షల మంది దర్శించుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. కాగా, ఆలయంలో లోపలికి వెళ్లేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు భక్తులు  తన్మయత్వంతో జైశ్రీరామ్ నినాదాలు చేశారు.

జేబులు గుల్ల

పవిత్ర అయోధ్యలో కూడా జేబు దొంగలు తమ చేతివాటం చూపారు. భారీగా తరలివచ్చిన భక్తుల జేబులను గుల్ల చేశారు. 8 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినా వాళ్లకు అడ్డులేకుండాపోయింది. హ్యాండ్ బ్యాగులు, పాకెట్లను టార్గెట్‌‌గా చేసుకుని.. నగదు, సెల్‌‌ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను కాజేశారు. అయోధ్యకు ఇతర నగరాల నుంచి నేరస్తుల ముఠా వచ్చి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన కల్యాణ్‌‌ అనే వ్యక్తి కూడా తన ఫోన్‌‌ పోయిందంటూ ఆన్‌‌లైన్‌‌లో ఫిర్యాదు చేసేందుకు సైబర్‌‌‌‌ కేఫ్‌‌కు వచ్చాడు.

రద్దీని కంట్రోల్‌‌ చేయలేక..

మంగళవారం ఉదయం ఉన్నట్టుండి రద్దీ పెరిగింది. రామ్ పథ్ గేట్‌‌వే మొత్తం బ్లాక్ అయిపోయింది. కొందరు సూట్‌‌కేసులు, ఇతర లగేజీతో రావడంతో క్యూలైన్లు, చెకింగ్స్‌‌ దగ్గర ఇబ్బందులు ఎదురయ్యాయి. టెంపుల్ ఆవరణలో ఎటు చూసినా జనమే. వాళ్లను కంట్రోల్ చేయడం సెక్యూరిటీ సిబ్బందికి కష్టమైంది. సెక్యూరిటీ గార్డులు తాళ్ల సాయంతో అడ్డుగా నిలిచి రద్దీని కంట్రోల్ చేశారు. తోసుకోవద్దంటూ నిరంతరం భక్తులకు స్పీకర్ల ద్వారా సూచనలు చేశారు. మరోవైపు, భారీ రద్దీ నేపథ్యంలో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారన్న ప్రచారాన్ని పోలీసులు ఖండించారు.

అయోధ్య వేడుక జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది: ప్రధాని మోదీ  

అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేడుక ఏండ్ల తరబడి మన జ్ఞాపకాల్లో నిలిచిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రాణప్రతిష్ఠ వేడుక వీడియోను ఆయన మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘నిన్న జనవరి 22న మనం అయోధ్యలో చూసినది.. రానున్న సంవత్సరాల్లో మన జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది” అని పోస్టులో పేర్కొన్నారు. కాగా, ఈ నెల 22న మోదీ చేతుల మీదుగా అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ వేడుక జరిగింది.