
నిర్భయ కేసులో దోషి పవన్ కుమార్ గుప్తా వేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. తనకు విధించిన ఉరి శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పిటిషన్ వేశాడు పవన్ కుమార్ గుప్తా. నిర్భయ దోషులు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తుండటంతో రేపు అమలు కావాల్సి ఉన్న ఉరి శిక్ష అనుమానంగానే కనిపిస్తోంది. రేపు ఉదయం ఆరు గంటలకు నలుగురిని ఉరి తీయాలని పటియాలా కోర్టు డెత్ వారెంట్ ఇవ్వగా.. దాన్ని వాయిదా వేయించేందుకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు దోషులు. రేపు అమలు కావాల్సి ఉన్న ఉరి శిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ.. అక్షయ్ తో పాటు మరో దోషి పవన్ గుప్తా విడివిడిగా పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది.
మరోవైపు రాష్ట్రపతికి మరోసారి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు అక్షయ్ కుమార్ ఠాకూర్. గతంలో అక్షయ్ పెట్టుకున్న అభ్యర్థనను ఫిబ్రవరి5న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. అయితే తొలిసారి పెట్టుకున్న పిటిషన్ లో తాను పూర్తి వివరాలు ఇవ్వలేదని, తన వాదన చెబుతూ మరోసారి పిటిషన్ వేస్తున్నారని తాజా పిటిషన్ లో చెప్పాడు అక్షయ్ కుమార్. తీహార్ జైల్లో దోషులను చిత్రహింసలు పెట్టారని, దానిపై NHRC విచారణ జరిపించాలని కోరుతూ.. రాజరాజన్ అనే సామాజిక కార్యకర్త ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైనా ఇవాళ విచారణ జరగనుంది.
దోషులు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తుండటంతో నిర్భయ పేరెంట్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలతో దోషులు ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. ఉరి శిక్షను త్వరగా అమలు చేయాలని కోరారు నిర్భయ తల్లి ఆశాదేవి.