వృద్ధుల కోసం డే కేర్ సెంటర్..కామారెడ్డి జిల్లా కేంద్రంలో వచ్చే నెలలో ఏర్పాటు

వృద్ధుల కోసం డే కేర్ సెంటర్..కామారెడ్డి జిల్లా కేంద్రంలో  వచ్చే నెలలో ఏర్పాటు
  • నిర్వహణ కోసం ఇప్పటికే ఎన్జీవో  ఎంపిక
  • సెంటర్​లో ఆట వస్తువులు,  బుక్స్ 

కామారెడ్డి, వెలుగు :  వృద్ధులు ఒంటరితనాన్ని అధిగమించేందుకు రాష్ట్ర సర్కార్​కొత్త అడుగు వేసింది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కారణంగా కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనమరాళ్లు ఇంట్లో ఉండరు. పల్లెల్లో పక్కవాళ్లతో ముచ్చట్లు పెట్టి కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కానీ పట్టణాల్లో ఎవరి ఇంటికి వారే పరిమితం. మందలించే వారు లేక మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధుల డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 15 నుంచి 20 రోజుల్లో డే కేర్ సెంటర్ ప్రారంభం కానుంది.  నిర్వహణ బాధ్యతల కోసం ఎన్జీవోను ఎంపిక చేశారు. 

సెంటర్ కోసం ప్రైవేటు భవనాన్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. భవనంలో ఆహ్లాదకర వాతావరణం కల్పించి, అవసరమైన ఫర్నిచర్, వస్తువులు సమకూర్చనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడుకోవడం, ఆటలాడుకోవడం, పుస్తకాలు చదవడం వంటి కార్యకలాపాలతో పొద్దంతా గడిపే అవకాశం ఉంటుంది. కామారెడ్డి పట్టణ జనాభా సుమారు లక్ష కాగా, అందులో 60 ఏళ్లు పైబడిన వారు దాదాపు 10 వేల మంది ఉన్నారు. ఉద్యోగ విరమణ చేసినవారే కాకుండా, వ్యాపారులు, ఇతర వృత్తులవారు ఈ సెంటర్‌‌‌‌ను 
వినియోగించుకోవచ్చు.

వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో..

స్త్రీ, శిశు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో వృద్ధుల డే కేర్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటయ్యే డే కేర్ సెంటర్  బాధ్యత కోసం ఎన్జీవో (స్వచ్ఛంద సంస్థ) ఎంపిక పూర్తైంది. ఒక ప్రైవేట్ భవనంలో సెంటర్​ ఏర్పాటు చేసి,  వృద్ధులు సులభంగా రాకపోకలు సాగించేలా మెట్లు, ఆరు బయట (రాంపులు) ఏర్పాటు చేయనున్నారు. భవన పరిసరాలు, గదుల్లో ఏ రంగులు వేయించాలో ఉన్నతాధికారులు స్పష్టమైన సూచనలు చేశారు. ఈ సెంటర్‌‌‌‌లో వృద్ధులు రోజంతా సేదతీరే అవకాశం ఉంటుంది. 

ఉల్లాసం... ఉత్సాహం.. 

వృద్ధులు ఉల్లాసం, ఉత్సాహంగా రోజంతా గడిపేలా అన్ని సౌకర్యాలతో డే కేర్ సెంటర్​ను సిద్ధం చేయనున్నారు. క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, చెస్ వంటి ఆట వస్తువులను సమకూరుస్తారు. అదనంగా టీవీ, పుస్తకాలు, పత్రికలు అందుబాటులో ఉంచుతారు.  వృద్ధులు కూర్చుని మాట్లాడుకునేందుకు, పుస్తకాలు చదవటానికి, ఆటలాడేందుకు అనువుగా ఫర్నిచర్ ఏర్పాటు చేస్తారు. ఇలా ఒకరితో ఒకరు ముచ్చటిస్తూ కాలక్షేపం చేయవచ్చు. 

త్వరలోనే ప్రారంభిస్తాం

జిల్లా కేంద్రంలో డే కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. సెంటర్ నిర్వహణ కోసం ఎన్జీవో ఎంపిక పూర్తైంది. అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.  వృద్ధులు ఆటలాడుతూ, పుస్తకాలు చదువుతూ,  కబుర్లు చెప్పుకుంటూ పొద్దంతా కాలక్షేపం చేసే వీలుంటుంది. - ప్రమీల, జిల్లా స్త్రీ, శిశు, వృద్ధుల సంక్షేమ శాఖ  అధికారి, కామారెడ్డి