90 సెకన్లలో నగల దుకాణం దోపిడీ... 17 కోట్ల విలువైన ఆభరణాలు, వాచ్ లు చోరీ..

90 సెకన్లలో నగల దుకాణం దోపిడీ... 17 కోట్ల విలువైన ఆభరణాలు, వాచ్ లు చోరీ..

సియాటెల్: ఓ నగల దుకాణాన్ని దుండగులు 90 సెకన్లలో మొత్తం దోచుకున్నారు. రూ.17 కోట్ల విలువైన సరుకులను దోపిడీ చేసి పరారయ్యారు. అమెరికాలోని వాషింగ్టన్  స్టేట్ సియాటెల్ సిటీలో గురువారం ఈ ఘటన జరిగింది. దొంగతనం చేసిన దృశ్యాలు దుకాణంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ముసుగు వేసుకున్న నలుగురు దొంగలు.. సిటీలో ఉన్న జువెలరీ షాపులో చొరబడ్డారు. ఏదో స్ప్రే లాంటి పదార్థంతో సిబ్బందిని బెదిరించారు. 

దుకాణంలోని డిస్ ప్లే కేసెస్ లో ఉంచిన నగలు, ఖరీదైన వాచీలు, డైమండ్లను వెంట తెచ్చుకున్న సంచుల్లో వేసుకున్నారు. ఈ దోపిడీ వ్యవహారం మొత్తం 90 సెకన్లలోనే పూర్తవడం గమనార్హం. దోపిడీకి గురైన వస్తువుల్లో రూ.6.5 కోట్ల విలువైన రొలెక్స్  వాచీలు, రూ.1.10 కోట్ల విలువైన ఎమరాల్డ్  నెక్లెస్  కూడా ఉన్నాయి. దుకాణం సిబ్బంది సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించి దర్యాఫ్తు చేపట్టారు.