ఢిల్లీ టాప్‌ షో: లీగ్‌‌లో పదో విక్టరీ

ఢిల్లీ టాప్‌ షో: లీగ్‌‌లో పదో విక్టరీ

దుబాయ్‌‌‌‌:  ప్లే ఆఫ్స్‌‌ బెర్తులు సొంతం చేసుకొని.. టాప్​–2 ప్లేస్​ల కోసం జరిగిన  పోరులో చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌‌దే పైచేయి అయింది. లీగ్‌‌లో పదో విక్టరీతో  సీఎస్‌‌కేను వెనక్కునెట్టిన క్యాపిటల్స్‌‌ టాప్‌‌ ప్లేస్‌‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన లో స్కోరింగ్‌‌ మ్యాచ్‌‌లో ఢిల్లీ 3 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. తొలుత బ్యాటింగ్‌‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 136/5 స్కోరు చేసింది. అంబటి రాయుడు (43 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 నాటౌట్) హాఫ్‌‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌‌ పటేల్‌‌ (2/18) పొదుపుగా బౌలింగ్‌‌ చేశాడు. అనంతరం ఢిల్లీ 19.4 ఓవర్లలో 139/7 స్కోరు చేసి గెలిచింది. శిఖర్‌‌ ధవన్‌‌ (35 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39), షిమ్రన్‌‌ హెట్‌‌మయర్‌‌ (18 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 28 నాటౌట్‌‌) ఢిల్లీని గెలిపించారు. అక్షర్​కు మ్యాన్‌‌ ఆఫ్‌‌  ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. 
రాయుడొక్కడే
చెన్నై ఇన్నింగ్స్‌‌లో అంబటి రాయుడు ఒక్కడే ఆకట్టుకునే పెర్ఫామెన్స్‌‌ చేశాడు. టాస్‌‌ ఓడిన సీఎస్‌కే బ్యాటింగ్‌‌కు దిగిగా.. ఫస్ట్‌‌ ఓవర్లోనే అన్రిచ్‌‌ నోర్జ్‌‌ ఎక్స్‌‌ట్రాలు సహా 16 రన్స్‌‌ ఇచ్చాడు. అవేశ్‌‌ వేసిన రెండో ఓవర్లో డుప్లెసిస్‌‌ (10) రెండు ఫోర్లతో జోరు మీద కనిపించాడు. కానీ, స్పిన్నర్‌‌ అక్షర్‌‌ తన నాలుగో బాల్‌‌కే అతడిని ఔట్‌‌ చేసి ఢిల్లీకి బ్రేక్‌‌ ఇచ్చాడు. ఆ వెంటనే నోర్జ్‌‌ బౌలింగ్‌‌లో రుతురాజ్​ గైక్వాడ్‌‌ (13).. అశ్విన్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వడంతో చెన్నై ఇన్నింగ్స్‌‌ డీలా పడింది. పవర్‌‌ప్లేలో 48/2 స్కోరుతో  సీఎస్‌‌కేను అశ్విన్‌‌, అక్షర్ ఇబ్బంది పెట్టారు.  అలీ (5)ని అక్షర్‌‌, ఊతప్ప (19) ను అశ్విన్‌‌ ఆరు బాల్స్‌‌ తేడాతో ఔట్‌‌ చేయడంతో సగం ఓవర్లకు చెన్నై 69/4 మాత్రమే చేసింది. ఈ దశలో ధోనీతో కలిసి రాయుడు టీమ్​ను ఆదుకున్నాడు.  అతి జాగ్రత్తగా ఆడిన ధోనీ (27 బాల్స్‌‌లో 18) సింగిల్స్‌‌ తీసేందుకూ ఇబ్బంది పడగా.. క్రీజులో కుదురుకున్నాక రాయుడు బ్యాట్‌‌కు పని చెప్పాడు. అవేశ్‌‌ వేసిన 12వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. తర్వాతి 4 ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వలేదు. కానీ, రబాడ వేసిన 17వ ఓవర్లో ఫోర్‌‌తో స్కోరు వంద దాటించిన అంబటి.. ఆపై, అవేశ్ బౌలింగ్‌‌లో 4,6 బాగాడు.  నోర్జ్‌‌ బౌలింగ్‌‌లోనూ 6, 4  కొట్టి 40 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కానీ, లాస్ట్‌‌ ఓవర్లో అవేశ్‌‌.. 4 రన్స్‌‌ మాత్రమే ఇచ్చి చెన్నైని కట్టడి చేశాడు. 
 ఆదుకున్న ధవన్‌‌, హెట్‌‌మయర్‌‌
చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఢిల్లీకి ధవన్‌‌ పునాది వేయగా.. చివర్లో ఒత్తిడిని జయించిన హెట్‌‌మయర్‌‌ జట్టును గెలిపించాడు.   ఫస్ట్ ఓవర్లోనే ధవన్‌‌ బౌండ్రీల ఖాతా తెరువగా.. పృథ్వీ షా   (18) వెంటవెంటనే మూడు ఫోర్లతో ఊపు మీద కనిపించాడు. కానీ, మూడో ఓవర్లో షాను దీపక్‌‌ చహర్‌‌ ఔట్‌‌ చేశాడు. ఈ టైమ్‌‌లో  ఒక్కసారిగా రెచ్చిపోయిన ధవన్‌‌.. చహర్‌‌ తర్వాతి  ఓవర్లోనే  వరుసగా 6, 4,  4, 6 బాది ఏకంగా 21 రన్స్‌‌ రాబట్టాడు.  కానీ, ఆరో ఓవర్లో హేజిల్‌‌వుడ్‌‌.. వన్‌‌డౌన్‌‌ బ్యాటర్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (2)ను ఔట్‌‌ చేశాడు. ఇక, ఓ సిక్స్‌‌, బౌండ్రీతో దూకుడుగా ఆడిన పంత్‌‌ (15)తో పాటు రిపల్‌‌ పటేల్‌‌ (18)ను ఔట్​ చేసిన జడేజా ఢిల్లీకి బ్రేక్​ ఇచ్చాడు.  ఆపై  శార్దూల్‌‌ ఠాకూర్‌‌ ఒకే ఓవర్లో అశ్విన్‌‌ (2)తో పాటు ధవన్‌‌ను ఔట్‌‌ చేసి చెన్నైని రేసులోకి తెచ్చాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హెట్‌‌మయర్‌‌, అక్షర్‌‌ పటేల్‌‌  (5) స్లోగా ఆడారు. విజయ సమీకరణం18 బాల్స్‌‌లో 28 రన్స్‌‌గా మారడంతో ఢిల్లీపై  ఒత్తిడి అమాంతం పెరిగింది. ఈ టైమ్‌‌లో బ్రావో వేసిన 18వ ఓవర్లో హెట్‌‌మయర్‌‌ రెండు ఫోర్లు కొట్టి ఒత్తిడి తగ్గించాడు. రెండో ఫోర్‌‌కు అతనిచ్చిన క్యాచ్‌‌ను సబ్‌‌స్టిట్యూట్‌‌ ఫీల్డర్‌‌ కృష్ణప్ప గౌతమ్‌‌ డ్రాప్‌‌ చేశాడు. 19వ ఓవర్లో  హెట్‌‌మయర్‌‌ సిక్స్‌‌ సహా 10 రన్స్‌‌ రాబట్టాడు. లాస్ట్ ఓవర్లో అక్షర్‌‌ను బ్రావో ఔట్‌‌ చేసినా.. రబాడ (4 నాటౌట్‌‌) విన్నింగ్​  ఫోర్‌‌ కొట్టాడు. 
సంక్షిప్త స్కోర్లు:
చెన్నై: 20 ఓవర్లలో 136/5 (రాయుడు 55*, అక్షర్‌‌ 2/18)
ఢిల్లీ: 19.4 ఓవర్లలో  139/7 (ధవన్‌‌ 39, హెట్‌‌మయర్‌‌ 28 నాటౌట్‌‌, శార్దూల్‌‌ 2/13, జడేజా 2/28).