ఢిల్లీ బంతి మెరిసింది.. డీసీ బౌలర్ల విజృంభణ

ఢిల్లీ బంతి మెరిసింది.. డీసీ బౌలర్ల విజృంభణ
  •     89 రన్స్‌‌కే జీటీ ఆలౌట్‌‌
  •     6 వికెట్లతో పంత్ సేన గెలుపు

అహ్మదాబాద్‌‌:  రికార్డు స్కోర్లు నమోదవుతూ.. భారీ టార్గెట్లు కరిగిపోతూ.. బ్యాటర్ల హవా నడుస్తున్న ఐపీఎల్‌‌ 17వ సీజన్‌‌లో తొలిసారి బంతి మెరిసింది. గత మ్యాచ్‌‌ల్లో తేలిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌ బౌలర్లు ఎట్టకేలకు అదరగొట్టారు. గుజరాత్ టైటాన్స్‌‌ను వారి హోమ్‌‌గ్రౌండ్‌‌లో పడగొట్టి లీగ్‌‌లో ఢిల్లీకి మూడో విజయం అందించారు. బుధవారం జరిగిన మ్యాచ్‌‌లో బ్యాటింగ్‌‌లో తేలిపోయిన గుజరాత్  6  వికెట్ల తేడాతో ఆ టీమ్‌‌ చేతిలో చిత్తయింది. ముకేశ్‌‌ కుమార్ (3/14), ఇషాంత్ శర్మ (2/8), ట్రిస్టాన్ స్టబ్స్‌‌ (2/11) దెబ్బకు తొలుత టైటాన్స్‌‌ 17.3 ఓవర్లలో 89 రన్స్‌‌కే ఆలౌటైంది.

రషీద్ ఖాన్ (24 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 31) టాప్ స్కోరర్. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు జీటీ టీమ్‌‌లో ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌‌కే పరిమితం అయ్యారు. ఈ సీజన్‌లో ఇదే లోయెస్ట్ కావడం గమనార్హం. తర్వాత ఢిల్లీ 8.5  ఓవర్లలోనే 92/4  స్కోరు చేసి గెలిచింది. జేక్ ఫ్రేజర్‌‌‌‌ (10 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 20), రిషబ్ పంత్ (16 నాటౌట్‌) రాణించాడు. రెండు క్యాచ్‌లు పట్టి, రెండు స్టంపౌట్స్‌ కూడా చేసిన పంత్​కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.  

జీటీ ఢమాల్

టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన  గుజరాత్ టైటాన్స్‌‌ కుప్పకూలింది. టాప్‌‌, మిడిలార్డర్  ఫెయిలవడంతో కనీసం వంద రన్స్‌‌ కూడా చేయలేకపోయింది.ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇషాంత్ వేసిన ఫుల్‌‌ లెంగ్త్‌‌  ఔట్ సైడ్ ఆఫ్ బాల్‌‌ను కాస్త ఆలస్యంగా ఆడిన కెప్టెన్ శుభ్‌‌మన్‌‌ గిల్ (8) పృథ్వీ షాకు క్యాచ్ ఇవ్వడంతో జీటీ వికెట్ల పతనం మొదలైంది. ఖలీల్ బౌలింగ్‌‌లో సుదర్శన్ (12 ) వరుసగా  రెండు ఫోర్లతో  ఊపు మీద కనిపించాడు. కానీ, సాహా (2) ముకేశ్ షార్ట్‌‌బాల్‌‌ను వికెట్ల మీదకు ఆడుకొని బౌల్డ్ అయ్యాడు.

ఆ వెంటనే టైట్ సింగిల్‌‌కు ట్రై చేసిన సుదర్శన్.. సుమిత్ కుమార్ డైవింగ్ త్రోకు రనౌటయ్యాడు. డేవిడ్ మిల్లర్ (2) కూడా నిరాశ పరచడంతో పవర్‌‌‌‌ ప్లేలో జీటీ 30/4తో నిలిచింది. తొమ్మిదో ఓవర్లో స్టబ్స్‌‌  మూడు బాల్స్ తేడాలో అభినవ్ మనోహర్ (8), ఇంపాక్ట్ ప్లేయర్ షారూక్ ఖాన్ (0)ను ఔట్‌‌ చేసి డబుల్ షాకిచ్చాడు. ఈ ఇద్దరూ స్టంపౌట్ అవగా గుజరాత్ 50/6తో పూర్తిగా డీలా పడింది. ఈ దశలో రషీద్ ఖాన్ ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. కానీ, మరో ఎండ్‌‌లో అతనికి సరైన సపోర్ట్ లభించలేదు. తెవాటియా (10) అక్షర్ బౌలింగ్‌‌లో ఎల్బీగా వెనుదిరగ్గా, మోహిత్ శర్మ (2) ఖలీల్ బౌన్సర్‌‌‌‌ను వెంటాడి సుమిత్‌‌కు క్యాచ్ ఇచ్చాడు. మరో రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో కుల్దీప్ బౌలింగ్‌‌లో సిక్స్‌‌తో రషీద్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, ముకేశ్‌‌ బౌలింగ్‌‌లో మరో షాట్‌‌కు ట్రై చేసి పంత్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వగా.. నూర్‌‌‌‌ అహ్మద్‌‌ (1) క్లీన్ బౌల్డ్‌‌ అవ్వడంతో జీటీ ఇన్నింగ్స్‌‌ ముగిసింది. 
 
53 బంతుల్లోనే

చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో వరుసగా వికెట్లు పడినా ఢిల్లీ క్యాపిటల్స్ ధాటిగా ఆడింది. పవర్ ప్లేలోనే 67 రన్స్‌ చేసిన ఢిల్లీ 53 బంతుల్లోనే టార్గెట్‌‌ను అందుకొని ఈజీగా గెలిచింది. తొలి ఓవర్లోనే 6,4 కొట్టిన జేక్ ఫ్రేజర్ తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. స్పెన్సర్ జాన్సన్ వేసిన రెండో ఓవర్లోనూ మరో 6, 4 రాబట్టిన అతను లాస్ట్ బాల్‌‌కు ఔటయ్యాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా (7) నిరాశ పరిచాడు. సందీప్ వేసిన మూడో ఓవర్లో స్పెన్సర్‌‌‌‌కు ఈజీ క్యాచ్‌‌ ఇచ్చాడు. ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌‌‌గా వచ్చిన అభిషేక్ పోరెల్ (15), షై హోప్ (19) దూకుడు కొనసాగించారు.  

స్పెన్సర్ బౌలింగ్‌‌లో పోరెల్ రెండు ఫోర్లు రాబట్టగా.. సందీప్ వేసిన నాలుగు ఓవర్లో  హప్‌‌ 4, 6, 6.. పోరెల్‌‌ సిక్స్‌‌తో 23 రన్స్‌‌ లభించాయి. అదే ఓవర్‌‌‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు పోరెల్‌‌, రషీద్ బౌలింగ్‌‌లో హోప్ ఔటైనా.. పవర్‌‌‌‌ ప్లేలో ఢిల్లీ 67/4తో నిలిచింది. మరో 23 రన్స్ అవసరమైన దశలో క్రీజులోకి వచ్చిన పంత్ (16 నాటౌట్‌‌).. నూర్‌‌‌‌ అహ్మద్ బౌలింగ్‌‌లో ఫోర్‌‌‌‌, రషీద్ బౌలింగ్‌‌లో క్రీజు దాటొచ్చి తన మార్కు సిక్స్‌‌తో అలరించాడు. నూర్‌‌‌‌ వేసిన తొమ్మిదో ఓవర్లో రెండు ఫోర్లతో సుమిత్ (9 నాటౌట్‌‌) మ్యాచ్ ముగించాడు. 

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్: 17.3 ఓవర్లలో 89 ఆలౌట్‌‌ (రషీద్ 31, ముకేశ్‌‌ 3/14, ఇషాంత్ 2/8)
ఢిల్లీ: 8.5 ఓవర్లలో 92/4 (జేక్‌‌ ఫ్రేసర్ 20, హోప్ 19, సందీప్ వారియర్ 2/40).