త్వరలో డీసీసీ అధ్యక్షులు ఖరారు .. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయం

త్వరలో డీసీసీ అధ్యక్షులు  ఖరారు .. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయం
  • నియామకాల్లో సామాజిక న్యాయం.. 
  • కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్‌ మహేశ్, డిప్యూటీ సీఎం భట్టి వేర్వేరుగా భేటీ
  • రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న అధిష్టానం
  • సమర్థులైన వారికి  బాధ్యతలు అప్పగించాలని డెసిషన్‌
  • డీసీసీ ఎంపికలో మా అభిప్రాయాలు  కోరారు: భట్టి
  • ఐదేండ్లు పనిచేసినోళ్లే అర్హులు: మహేశ్ కుమార్ గౌడ్

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్​ జిల్లా కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అనంతరం సామాజిక న్యాయం ప్రకారం.. సమర్థులైన వారికి డీసీసీ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించింది.  శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీస్ ఇందిరా భవన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ వేర్వేరుగా సమావేశమయ్యారు. 

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్‌‌‌‌తో కలిసి దాదాపు 2 గంటలపాటు డీసీసీ ఎంపిక, రాష్ట్రంలోని తాజా అంశాలపై కేసీ వేణుగోపాల్‌‌‌‌ చర్చించారు. తొలుత సీఎంతో వేణుగోపాల్​ భేటీ అయ్యారు. 

అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌తో సమావేశమయ్యారు. రాష్ట్రస్థాయిలో పార్టీ బలోపేతం, సంఘటన్ సృజన్ అభియాన్ పురోగతి, జిల్లాస్థాయి నాయకత్వ మార్పులపై విశ్లేషణాత్మక చర్చలు జరిపారు. ప్రధానంగా రాష్ట్రంలో మొత్తం 35 డీసీసీలకు, 4 కార్పొరేషన్లనకు అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇందుకోసం దాదాపు నెల నుంచి కసరత్తు సాగుతున్నది. 

ఈ ఎంపికపై ఏఐసీసీ నియమించిన 22 మంది అబ్జర్వర్లు సైతం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ఒక్కో డీసీసీ పదవికి ముగ్గురి పేర్లను సూచించారు. ఈ లిస్ట్ ను అధిష్టానానికి సమర్పించారు. ఈ లిస్ట్ తోపాటు సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అభిప్రాయాలను కేసీ వేణుగోపాల్​ అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి వివాదంలేని వారి అధ్యక్షులుగా ఖరారు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఫైనల్ చేసిన పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలతోపాటు తెలంగాణ జాబితాను ఒకటి, రెండు రోజుల్లో పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. 

కాగా, రాష్ట్రంలోని  తాజా రాజకీయ పరిణామాలు, మంత్రుల మధ్య విభేదాలు, పార్టీ అంతర్గత అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. వీటితోపాటు జూబ్లీహిల్స్ బైపోల్, లోకల్ బాడీ ఎన్నికల హైకోర్టు స్టే, మంత్రి వర్గ విస్తరణ, ఇతర అంశాలను కేసీ వేణుగోపాల్‌‌‌‌కు సీఎం  రేవంత్‌‌‌‌ వివరించినట్లు తెలిసింది.  

డీసీసీల్లోనూ సామాజిక న్యాయం..

పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకు డీసీసీ నియామకాల్లోనూ సామాజిక న్యాయం పాటించనున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఒక్కో వర్గానికి ఒక్కో నేత చొప్పున  పేర్లను పరిశీలించినట్లు సమాచారం. 

దీని ఆధారంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతోపాటు మహిళల్లో సమర్థులైన వారికి బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలిసింది. అలాగే,  ప్రస్తుతం డీసీసీలుగా ఉన్న వారిని పక్కన పెట్టి, ఐదేండ్లు పార్టీలో పని చేస్తున్న వారికి అవకాశం కల్పించనున్నది. ముఖ్యంగా పార్టీ కోసం ఫుల్ టైంగా పని చేస్తున్న నేతలను మాత్రమే ఈ పదవులు వరిస్తాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.  కాగా, ప‌‌‌‌లు జిల్లాల‌‌‌‌కు సంబంధించిన డీసీసీ అధ్యక్షుల ఎంపికపై పీటముడి వీడ‌‌‌‌లేద‌‌‌‌ని తెలిసింది.  

ఇతర పదవుల్లో ఉన్న వారికి నో చాన్స్: పీసీసీ చీఫ్ మహేశ్  గౌడ్ 

సమర్థులైన వారినే డీసీసీ అధ్యక్ష పదవులకు ఎంపిక చేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్‌‌‌‌ కుమార్ గౌడ్ తెలిపారు. అయితే, ఈ పదవుల ఎంపికలోనూ సామాజిక న్యాయం పాటించనున్నట్టు చెప్పారు. కనీసం పార్టీలో ఐదేండ్లు పనిచేసిన వారే ఈ పదవికి అర్హులని నిబంధన పెట్టినట్టు వెల్లడించారు.  కేసీ వేణుగోపాల్‌‌‌‌తో భేటీకి ముందు మహేశ్‌‌‌‌గౌడ్​ మీడియాతో మాట్లాడారు. 

డీసీసీల నియామకాల్లో అందరి అభిప్రాయాలను హైకమాండ్ తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటికే జిల్లాల అధ్యక్షులకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఎంపికలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఇతర పదవుల్లో ఉన్నవారికి డీసీసీ పదవి ఇవ్వకూడదనే నిబంధన ఉందని చెప్పారు.