ఇవాళ (అక్టోబర్ 16) సూర్యాపేటకు జానయ్య.. 55 రోజుల అనంతరం రిటర్న్

ఇవాళ (అక్టోబర్ 16) సూర్యాపేటకు జానయ్య.. 55 రోజుల అనంతరం రిటర్న్

సూర్యాపేట, వెలుగు : డీసీఎంఎస్  చైర్మన్  వట్టే జానయ్య యాదవ్  ఎట్టకేలకు సూర్యాపేటలో అడుగుపెట్టనున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా బీసీ నినాదంతో ఎమ్మెల్యే పదవికి పోటీచేస్తామని జానయ్య ప్రకటించిన తర్వాత తమ భూములను ఆయన ఆక్రమించారంటూ 72 మంది ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి.  తనపై 11 కేసులు నమోదైనప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనపై కుట్రపన్ని అక్రమ కేసులు నమోదు చేశారని, కేసుల వెనుక మంత్రి జగదీశ్  రెడ్డి ఉన్నారని ఆయన సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయనకు బీఎస్పీ మద్దతుగా నిలబడింది. సూర్యాపేట నుంచి జానయ్యను ఆ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. 

భారీ ర్యాలీకి మద్దతుదారుల ఏర్పాటు

భూములు ఆక్రమించారంటూ జానయ్యపై నమోదైన కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఆయనపై నమోదైన 13 కేసుల్లో జానయ్యను అరెస్టు చేయరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ ప్రోద్బలంతోనే ఐదు రోజుల్లోనే తనపై 11 కేసులు నమోదు చేశారని ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ముందస్తు బెయిల్  మంజూరు చేసింది. తాజాగా ఆయనపై మరో రెండు కేసులు నమోదు చేయడంతో ఆ కేసుల్లోనూ అరెస్టు చేయరాదని కోర్టు నుంచి ముందస్తు బెయిల్  తెచ్చుకున్నారు. అంతేకాకుండా పాత కేసులతో పాటు కొత్తగా కేసులు నమోదు చెయ్యొదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో 55 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న జానయ్య సోమవారం సూర్యాపేటకు వస్తానని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆయన మద్దతుదారులు, అభిమానులు సూర్యాపేటలో భారీ ర్యాలీతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన రాకతో సూర్యాపేటలో టెన్షన్  వాతావరణం నెలకొంది. బీఎస్పీ అభ్యర్థిగా జానయ్యను ప్రకటించడంతో సూర్యాపేటలోని విద్యా నగర్ లో బీఎస్పీ ఆఫీసును  ఆ పార్టీ స్టేట్  కోఆర్డినేటర్  ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్  ప్రారంభించారు. మంత్రి జగదీశ్  రెడ్డి ఆఫీసు పక్కనే జానయ్య ఆఫీసు కూడా ప్రారంభించారు. మరోవైపు ఎన్నికల కోడ్  రావడంతో మంత్రి జగదీశ్  రెడ్డి ఎమ్మెల్యే  క్యాంప్  ఆఫీస్  ఖాళీచేసి తన పాత ఆఫీస్  నుంచే పార్టీ కార్యాకలపాలు కొనసాగిస్తున్నారు. పక్కపక్కనే జగదీశ్  రెడ్డి, జానయ్య ఆఫీసులు ఉండడంతో ఏ క్షణాన ఏం జ రుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.