మూడు ముక్కలు ఒక్కటయ్యేనా?.. సీఎం హామీపై ప్రజల ఎదురుచూపులు

మూడు ముక్కలు ఒక్కటయ్యేనా?.. సీఎం హామీపై ప్రజల ఎదురుచూపులు

హుస్నాబాద్, వెలుగు:  సీఎం రేవంత్​రెడ్డి హుస్నాబాద్​పర్యటన సందర్భంగా అందరూ మూడు ముక్కలైన హుస్నాబాద్​నియోజకవర్గాన్ని తిరిగి కరీంనగర్​జిల్లాలో కలపాలనే అంశంపై జోరుగా చర్చిస్తున్నారు. పీసీసీ చీఫ్​గా ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా అమలు చేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో చేర్చారు. 

ఒకే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేపట్టాలంటే మూడు జిల్లాల కలెక్టర్లు, మూడు జిల్లాల ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. పాలనా పరమైన చిక్కుల వల్ల అభివృద్ధి ముందుకు సాగడంలేదు. 

హామీల భారం.. నెరవేర్చే తరుణం..

ఈ అశాస్త్రీయ విభజనపై కాంగ్రెస్ ఎన్నికల సమయంలో స్పష్టమైన హామీ ఇచ్చింది. అప్పుడు పీసీసీ చీఫ్​గా ఉన్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హుస్నాబాద్​ను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానమే కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

 హుస్నాబాద్ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడానికి, ఆ ప్రాంత అభివృద్ధికి అడ్డుగా ఉన్న మూడు జిల్లాల బంధనాన్ని తెంచాలని స్థానికులు బలంగా కోరుతున్నారు. మూడు ముక్కలు తిరిగి ఒక్కటై పూర్వ వైభవాన్ని, పరిపాలనా సౌలభ్యాన్ని పొందే నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని హుస్నాబాద్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రజల ఇబ్బందులు

సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ ను కలిపిన తర్వాత ప్రజలకు అది భారంగా మారింది. గతంలో కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ లో అన్ని పనులు చక్కబెట్టుకున్న ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ పనుల కోసం సిద్దిపేట, న్యాయ వ్యవహారాల కోసం ఏకంగా 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డికి ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. 

వ్యాపారస్తులు ఈ మార్పుతో నష్టపోతున్నారు. గతంలో కరీంనగర్ వ్యాపార కేంద్రంగా ఉన్నందున, సరుకులు తెచ్చుకునేందుకు వెళ్లినప్పుడు జిల్లా కేంద్రంలో ఉండే ఇతర ప్రభుత్వ పనులను పూర్తి చేసుకునేవారు. ఇప్పుడు ఆ సౌలభ్యం లేకుండా పోయింది. వ్యాపారం వేరు, ప్రభుత్వ పనులు వేరుగా మారాయి.

భారంగా న్యాయ వ్యవహారాలు

ప్రజలకు అత్యంత భారంగా మారింది న్యాయ వ్యవహారాలే. కోర్టు కేసులు, ఆలయాల రిజిస్ట్రేషన్లు, కుల సంఘాలు, యువత సంఘాల రిజిస్ట్రేషన్ వంటి ముఖ్యమైన పనులన్నీ ఇప్పుడు సంగారెడ్డి కేంద్రంగా సాగుతున్నాయి. గతంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యాయ స్థానం నేడు 170 కిలోమీటర్ల దూరానికి చేరింది. కరీంనగర్‌‌‌‌కు వెళ్తే రోజులో పని పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకునే వాళ్లు. 

ఇప్పుడు సంగారెడ్డికి వెళ్లాలంటే ఒక రోజు ప్రయాణం, మరో రోజు పని, ఇంకో రోజు ప్రయాణం  మూడు రోజులు వృథా అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం మార్పుతో సౌకర్యానికి బదులు ఇబ్బందులే ఎక్కువయ్యాయని, కనీసం న్యాయస్థానం పనులకైనా దగ్గరి కేంద్రాన్ని కేటాయించాలని కోరుతున్నారు.