
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుపై విద్యార్థి సంఘాల నేతల మధ్య విబేధాలకు దారితీసింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు యూనివర్సిటీ భూములు కాకుండా ఇతర ప్రభుత్వ భూములు కేటాయించాలని కొందరు విద్యార్థి సంఘాల నేతలు గురువారం సంతకాల సేకరణ చేపట్టారు. భారత్ బచావో రాష్ట్ర నాయకులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు వెంగల్ రెడ్డి, ఓం బ్రహ్మం చీఫ్ గెస్టులుగా హాజరై నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. కానీ యూనివర్సిటీ భూములు తీసుకోవడం వల్ల, వర్సిటీ భవిష్యత్తు అవసరాలకు కొరత ఏర్పడుతుందన్నారు. పీడీఎస్ యూ, ఏఐఎఫ్డీఎస్, డీఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, స్వేరోస్, బీఎస్ఎఫ్, బీఆర్ఎస్వీ, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అడ్డుకోవడం సరికాదు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను పార్టీలకు అనుబంధంగా పని చేసే కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకోవడం సరికాదని ఎన్‌ఎస్‌యూఐతో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. యూనివర్సిటీ ల్యాండ్ లోనే యంగ్ ఇండియా స్కూల్ ను నిర్మించాలని డిమాండ్ చేస్తూ గురువారం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట ఆందోళన చేపట్టారు.