49 కంపెనీల అప్పు 69 వేల కోట్లు

49 కంపెనీల అప్పు 69 వేల కోట్లు

49 లిస్టెడ్ కంపెనీలు తీర్చని అప్పులు
సెబీ ఆదేశంతో స్టాక్‌ ఎక్స్చేంజ్‌ లకు వివరాలు..
అనిల్‌ అంబానీ గ్రూప్‌ దే పెద్ద వాటా

ముంబై: లిస్టెడ్‌ కంపెనీలన్నీ తప్పనిసరిగా డిఫాల్ట్‌‌ అయిన అప్పుల వివరాలు వెల్లడించాలనే సెబీ ఆదేశాల మేరకు తాజాగా మరో 20 కంపెనీలు తమ అప్పుల డిఫాల్ట్‌‌లను మొట్టమొదటిసారిగా ప్రకటించాయి. డిఫాల్ట్‌‌ అయిన అప్పుల వివరాలను ఆ 20 కంపెనీలు స్టాక్‌ ఎక్స్చేంజ్‌‌లకు పంపించాయి. సుజ్లాన్‌ ఎనర్జీ, జేపీ ఇన్‌ ఫ్రాటెక్‌ లతోపాటు, అనిల్‌‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీలు కొన్ని తమ అప్పుల డిఫాల్ట్‌‌ వివరాలను పంపించిన వాటిలో ఉన్నాయి. మొత్తం 49 లిస్టెడ్‌ కంపెనీలు కలిపి రూ. 69,140 కోట్ల మేర డిఫాల్ట్‌‌ అయ్యాయి. ఈ కంపెనీల అప్పులు మొత్తం రూ. 3.66 లక్షల కోట్లు పైమాటే. అప్పులు, వాటిపై వడ్డీ చెల్లింపులలో విఫలమైతే ఆ వివరాలను లిస్టెడ్‌ కంపెనీలన్నీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని నవంబర్‌ 21 న సెబీ ఆదేశాలు జారీ చేసింది. అప్పులు, వాటిపై వడ్డీని చెల్లించాల్సిన టైం లోపల చెల్లించలేకపోతే అంటే డిఫాల్టైతే వాటి వివరాలు లిస్టెడ్‌ కంపెనీలు బయటపెట్టాల్సిందేనని పేర్కొంది. డిఫాల్టయిన తర్వాత కూడా మరో 30 రోజుల వ్యవధిని సెబీ ఆ కంపెనీలకు ఇస్తోంది. ఐతే, ఈ గడువు ముగిశాక మాత్రం 24 గంటలలోపే తప్పనిసరిగా స్టాక్‌ ఎక్స్చేంజ్‌‌లకు వాటి వివరాలు వెల్లడించాలని సెబీ నిర్దేశించింది. ఈ కొత్త రూల్‌‌ జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది.

తాజాగా వివరాలు ప్రకటించిన 20 కంపెనీలు టర్మ్‌ లోన్స్‌‌, ఎన్‌సీడీలు, వర్కింగ్‌ క్యాపిటల్‌‌ లోన్స్‌‌, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ వంటి వివిధ అంశాలలో డిఫాల్టయ్యాయి. ఈ 20 కంపెనీల డిఫాల్ట్స్‌ మొత్తం భారీగానే ఉంది. రిలయన్స్‌‌ నావల్‌‌ అండ్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ రూ. 9,491.96 కోట్లు డిఫాల్టవగా, రిలయన్స్‌‌ పవర్‌ రూ. 685 కోట్లు, నేషనల్‌‌ స్టీల్‌‌ అండ్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ రూ. 1,134.8 కోట్లు, రిలయన్స్‌‌ కమ్యూనికేషన్‌ రూ. 32,575 కోట్లు, సుజ్లాన్‌ ఎనర్జీ రూ. 7,256 కోట్లు, జేపీ ఇన్‌ ఫ్రాటెక్‌ రూ. 6,721 కోట్లు డిఫాల్టయ్యాయి. సుజ్లాన్‌ ఎనర్జీ మార్చి 19, 2019 నాటికే తిరిగి చెల్లించాల్సిన అప్పులు ఇప్పటికీ చెల్లించలేకపోయింది. ఎస్‌బీఐ, ఇరెడాల నాయకత్వంలో 18 బ్యాంకులు సుజ్లాన్‌‌కు ఈ అప్పులు ఇచ్చాయి. తన మొత్తం అప్పులు రూ. 13,438 కోట్లని జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ ప్రకటించింది. ఈ కంపెనీకి ఐడీబీఐ బ్యాంక్‌, ఎల్‌‌ఐసీ, కార్పొరేషన్‌ బ్యాంక్‌ అప్పులు ఇచ్చిన వాటిలో ఉన్నాయి. ప్రస్తుతం డిఫాల్ట్‌‌ రూ. 6,721 కోట్లని ఆ కంపెనీ తెలిపింది. ఐబీసీ కింద దివాలా ప్రక్రియలో ఉన్న ఈ కంపెనీ రిజొల్యూషన్‌‌కు ఎన్‌ బీసీసీ ఇచ్చిన ప్లాన్ అప్రూవ్‌ అయ్యింది.

చాలా లిస్టెడ్‌ కంపెనీలు తమ అప్పులు, వాటిపై వడ్డీ చెల్లింపులలో విఫలమైతే, ఆ వివరాలను బయటకు చెప్పకుండా దాచిపెట్టడం వల్ల ఇన్వెస్టర్లకు సరైన ఇన్ఫర్మేషన్‌ దొరకడం లేదని, అందుకే నిబంధనలను మార్చామని సెబీ పేర్కొంటోంది. ఇందువల్ల లిస్టెడ్‌ కంపెనీల పారదర్శకత పెరుగుతుందని సీ యూనివర్సల్‌‌ లీగల్‌‌ పార్ట్‌‌నర్‌ ఇంద్రజిత్‌ మిశ్రా తెలిపారు. గత ఏడాది కాలంగా చాలా లిస్టెడ్‌ కంపెనీలు తమ అప్పులు, వడ్డీలు చెల్లించడంలో డిఫాల్ట్‌‌ అయ్యాయి. అదేవిధంగా ఆ వివరాలను షేర్‌ హోల్డర్లకు తెలపడంలోనూ విఫలమయ్యాయి. అకస్మాత్తుగా భారీ డిఫాల్ట్‌‌ వివరాలు వెల్లడించినప్పుడు ఆయా కంపెనీల షేర్లు కుప్పకూలుతున్నాయి.