అప్పులు తెచ్చుడు..  మిత్తీలకు కట్టుడు

అప్పులు తెచ్చుడు..  మిత్తీలకు కట్టుడు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర సర్కారు అప్పుల మీద అప్పులు చేస్తున్నది. కొత్తగా చేసిన అప్పుల్లో ఎక్కువ భాగం పాత అప్పుల మిత్తీలకు కట్టేందుకే వాడుతున్నది. 2021–22 ఫైనాన్షియల్​ ఇయర్​లో ఎనిమిది నెలల్లో (ఏప్రిల్​ నుంచి నవంబర్​ వరకు) చేసిన అప్పు రూ. 30,194 కోట్లు అయితే..  అందులోంచి రూ. 11,882 కోట్లు గతంలో చేసిన అప్పులకు ఇంట్రస్ట్​ చెల్లించేందుకే ఉపయోగించింది. ముందు చూపు లేకుండా విచ్చలవిడిగా అప్పులు చేయడంతో ఖాజానాపై భారం పడుతున్నదని ఫైనాన్స్​ ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. ఒకవైపు ప్రజలపై చార్జీలు మోపుతూ, లిక్కర్​ వ్యాట్​ పెంచుతూ, భూములు అమ్ముతూ ఆదాయం రాబట్టుకుంటున్న సర్కారు.. నెల మొదలైందంటే చాలు అప్పు చేస్తే  కానీ జీతాలు, పాత అప్పుల వడ్డీలకు సర్దుబాటు చేయలేని పరిస్థితికి చేరుకుంది. 

ఒకవైపు ప్రజలపై చార్జీలు మోపుతూ, లిక్కర్​ వ్యాట్​ పెంచుతూ, భూములు అమ్ముతూ ఆదాయం రాబట్టుకుంటున్న సర్కారు.. నెల మొదలైందంటే చాలు అప్పు చేస్తే  కానీ జీతాలు, పాత అప్పుల వడ్డీలకు సర్దుబాటు చేయలేని పరిస్థితికి చేరుకుంది. చాలా  స్కీంలకు నిధులు విడుదలవడం లేదు. కొన్ని స్కీంలు ప్రకటించి ఏండ్లు గడుస్తున్నా.. ఇంతవరకు స్టార్ట్​ చేసిందీ లేదు. మిత్తీలకు కట్టే పైసలతోటి 90% ఉద్యోగులకు జీతాలియ్యొచ్చు. రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా కాగ్​కు పంపిన రిపోర్ట్​ ప్రకారం 2021 ఏప్రిల్ ​నుంచి నవంబర్​ వరకు సొంత రాబడి 8 నెలల్లో రూ. 64,857 కోట్లు ప్రభుత్వానికి సమకూరింది. ఇంకో రూ. 30,194 కోట్లు అప్పు తీసుకుంది. సగటున నెలకు లెక్కల్లోకి వచ్చే అప్పు రూ. 4 వేల కోట్లు తెచ్చినా..  రాష్ట్ర ఆర్థిక నిర్వహణ కష్టంగా సాగుతున్నది. ప్రతినెలా యావరేజ్​ గా రాష్ట్రానికి వస్తున్న ఇన్​కం రూ. 10 వేల కోట్ల లోపు ఉంటుంది. ప్రతినెలా సర్కార్ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు  రూ.3,500 కోట్లతో పాటు పాత అప్పుల కిస్తీలు, వడ్డీలకు ఇంకో రూ. మూడు వేల కోట్లు వెచ్చించాల్సి వస్తున్నది. ఇలాంటి టైమ్​లో భారీ అంచనాలతో తెస్తున్న స్కీములకు కావాల్సిన పైసలు ఎట్లా తెస్తరు ? ఇప్పటికే అమలవుతున్న స్కీంలకు సొమ్ము ఎలా అడ్జస్ట్​ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.  ప్రతినెల ఇంట్రస్ట్ లకు కడుతున్న సొమ్ముతో 90 శాతం మంది ఉద్యోగులకు ఒక నెల శాలరీలు చెల్లించొచ్చని ఆఫీసర్లు అంటున్నారు. వాస్తవానికి కిస్తీలు ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. అవి కూడా కట్టుడు మొదలైతే ప్రతినెలా అప్పు, వడ్డీలకు కలిపి యావరేజ్​గా రూ. 5 వేల కోట్లపైనే చెల్లించాల్సి వస్తుందని ఫైనాన్స్​ ఆఫీసర్లు చెప్తున్నారు. 

వెల్ఫేర్​కు పైసలేవి?
రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తున్నా.. అప్పులు తెస్తున్నా... వెల్ఫేర్​ స్కీమ్స్​కు ప్రభుత్వం పెద్దగా ఫండ్స్​ విడుదల చేయడం లేదు. రైతు బంధు, ఆసరా స్కీమ్స్, ఆరోగ్య శాఖకు కొంత ఇవ్వడమే తప్ప ఇతర వెల్ఫేర్​ స్కీమ్స్​ను పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ కల్యాణ లక్ష్మి, స్కాలర్​షిప్స్​, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల కింద అమలవుతున్న స్కీమ్స్​కు విడతల వారీగా నాలుగైదు నెలలకోసారి కొంత, కొంత డబ్బులిస్తున్నది. కొత్తగా డబుల్​ బెడ్రూం ఇండ్లకు కూడా ఒక్క పైసా ఇవ్వలేదు. బడ్జెట్​లో పెట్టుకున్నట్లు జాగా ఉన్నోళ్లకు రూ.5 లక్షలు ఇచ్చే అంశాన్ని పట్టించుకోవడం లేదు. కొత్త పెన్షన్ల ముచ్చటే లేకుండాపోయింది. దళిత బంధు పథకం హుజూరాబాద్​ తో పాటు ప్రకటించిన మరో 4 మండలాల్లోనూ ముందుకు సాగుతలేదు. 

ఏం చేస్తే సర్దుబాటైతదని..

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ 2022–23 బడ్జెట్​అంచనాలు, ప్రస్తుత ఫైనాన్షియల్​ ఇయర్​ సవరణలపై దృష్టి పెట్టింది. గత బడ్జెట్​లో పెట్టుకున్నట్లు ఆదాయం రాకపోవడంతో ఎట్లా అంచనాలు సవరించాలనే దానిపై ఆఫీసర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, స్కీంలు, అప్పుల వడ్డీలకు ఎలా సర్దుబాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఎక్కడ కోత పెట్టాలి ? వచ్చే ఏడాదికి అంచనాలు ఎలా రూపొందించాలనే దానిపై తీవ్ర తర్జనభర్జనలు పడుతున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో వడ్డీలకు కనీసం రూ. 20 వేల కోట్ల దాకా కేటాయించాల్సి ఉంటుందని అంటున్నారు. అదే టైంలో కిస్తీలకు కూడా కట్టాల్సి ఉంటుందని చెప్తున్నారు.

ఆదాయం కోసం దేన్నీ వదలడం లేదు

ఆదాయం రాబట్టుకునేందుకు రాష్ట్ర సర్కార్​  దేన్నీ వదలడం లేదు. అప్పులు చేయడమే కాకుండా వీలు దొరికినప్పుడల్లా సర్కారు ఆస్తులను, భూములను అమ్మేస్తున్నది. ఇప్పటికే కోకాపేట, ఖానామెట్​లో కొన్ని భూములను అమ్మింది. వేలంలో ఈ భూములు దాదాపు రూ. 2,800 కోట్లు పలికాయి. ఇంకిన్ని భూములు అమ్మేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. ఇక.. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను మూడు శ్లాబులుగా విడదీసి 30 శాతం నుంచి 50 శాతం దాకా పెంచింది. రిజిస్ట్రేషన్ ​చార్జీలు 7.5 శాతానికి పెంచింది. ఈ రెండింటి వల్ల రాష్ట్ర ఆదాయం ప్రతి నెలా అదనంగా రూ. 500 కోట్లు ఎక్కువైంది. ఎక్సైజ్ అప్లికేషన్ల ఫీజుతో ఇటీవల రూ.1,300  కోట్లు ఖజానాకు సమకూరాయి. ఎక్సైజ్​ వ్యాట్​ రూపంలో ప్రభుత్వం వేల కోట్లు రాబట్టుకుంటున్నది. పెట్రోల్, డీజిల్​ రేట్లు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో కొంత​వ్యాట్​ తగ్గించి,  రాష్ట్రాలను కూడా తగ్గించాలని సూచించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదు. మరోసారి రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నది. 

మిగులు పోయె.. అప్పు పెరిగె

రాష్ట్రంగా ఏర్పడే నాటికే తెలంగాణ మిగులు బడ్జెట్‌‌లో ఉంది. 2014లో రూ. 69,517 కోట్ల అప్పు ఉండగా.. ఇప్పుడు ఏడేండ్లలో అది 4 లక్షల కోట్లకు చేరింది. ఇందులో రూ. లక్షన్నర కోట్ల అప్పులు ఎఫ్ఆర్‌‌‌‌బీఎం చట్టం పరిధిలో కాకుండా వివిధ కార్పొరేషన్లు, ఇతర మార్గాల ద్వారా తీసుకున్నవే ఉన్నాయి. రాష్ట్ర సర్కార్ తీసుకునే అప్పులతో ప్రజలపై తలసరి అప్పు ఏటేటా పెరిగిపోతున్నది. కిందటేడాది సవరించిన బడ్జెట్ లెక్కల ప్రకారం ఇది రూ. 70,080 కాగా.. ఈసారి మరో రూ.11,864 పెరిగింది. అంటే ఒక్కో వ్యక్తిపై రూ. 81,944 అప్పు ఉంది.