ఇష్టారీతిన చేస్తున్న అప్పులు నష్టం చేస్తయ్

ఇష్టారీతిన చేస్తున్న అప్పులు నష్టం చేస్తయ్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఇష్టారీతిన చేస్తున్న అప్పులు నష్టం చేస్తాయని కేంద్రం అభిప్రాయపడింది. రాజకీయ పరిస్థితులతో పాటు, స్థాయికి మించిన అప్పుల వల్లే శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితి నెలకొందని చెప్పింది. మంగళవారం విదేశాంగ మంత్రి జైశంకర్ అధ్యక్షతన కేంద్రం పార్లమెంటులో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది. టీఆర్ఎస్, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. శ్రీలంక సంక్షోభంతో పాటు మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు చేస్తున్న అప్పులు, పర్యవసానాలపై అధికారులు ‘ప్రజెంటేషన్’ ఇచ్చారు. ఇందులో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలు చేస్తున్న అపరిమిత అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ అంశాన్ని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, నామా నాగేశ్వర రావు వ్యతిరేకించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ ఉందని వివరించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పుల గురించి మాత్రమే మాట్లాడడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని మండిపడ్డారు.