బీఆర్ఎస్ నాయకులది స్వేదపత్రం కాదు.. సౌధపత్రం: పొన్నం ప్రభాకర్

 బీఆర్ఎస్ నాయకులది స్వేదపత్రం కాదు.. సౌధపత్రం: పొన్నం ప్రభాకర్
  • సమస్యల పరిష్కారం కోసమే ప్రజాపాలన 
  • రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 సిద్దిపేట:  ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజులైనా కాలేదు. బీఆర్ఎస్ నాయకులు స్వేదపత్రం పేరుతో విమర్శలు చేస్తున్నారు. వాళ్లది స్వేదపత్రం కాదు. సౌధపత్రం. అప్పులతోపాటు ఆస్తులు పెంచినమని గొప్పలు చెప్తున్నరు. తెలంగాణను అప్పుల్లో ముంచిండ్రు. కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు పెంచుకున్నరు.’ అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్  మాట్లాడారు.  ఏ అత్త కూడా కొత్త కోడలును ఇరవై రోజుల్లో ఏమీ అనదని, అన్నీ సర్దుకున్నాకే మంచీ చెడు మాట్లాడుతుందన్నారు. అలాంటిది బీఆర్ఎస్ నాయకులుమాత్రం స్వేదపత్రం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారన్నారు. అది స్వేదపత్రం కాదని కల్వకుంట్ల కుటుంబ సౌధపత్రం’ అని విమర్శించారు.  

మీరు ఎన్నెన్ని బంగ్లాలు కట్టుకున్నరు?ఎన్నెన్ని ఫామ్ హౌజులు ఏర్పాటు చేసుకున్నరు? మీ ఇండ్లకు వందలకోట్ల విలువ ఎట్ల వచ్చింది?’ దీనిమీద సౌధపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పులు చేసి తెలంగాణకు ఆస్తులు పెంచామని గొప్పలు చెప్తున్నారని, వాస్తవానికి తెలంగాణను అప్పుల్లో ముంచి కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు పోగేసుకుందని మండిపడ్డారు.  రూ.7లక్షలకోట్ల అప్పులు పెంచి రాష్ట్రాన్ని ఆగంచేశారన్నారు.  వాళ్ల ఆస్తులను వందేండ్లు తరగకుండా పెంచుకున్నారన్నాని ఆరోపించారు. 

రెండు రోజుల్లోనే రెండు హామీలు నెరవేర్చినం

 కాంగ్రెస్ పరిపాలన దక్షతతో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని మంత్రి అన్నారు.అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు వైద్యం చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ఇప్పటివరకు నాలుగు కోట్ల మంది మహిళలు జీరో టికెట్ల మీద ప్రయాణం చేశారని చెప్పారు. ఇంకా కొంత ఫ్రీక్వెన్సీ, ఆక్యుపెన్సి పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు.  కొన్ని రూట్లలో బస్సులు కావాల్సి ఉందన్నారు.  వాటన్నింటిని సమీక్షించుకొని అన్ని రూట్లలో బస్సులు నడుపుతామని చెప్పారు. బస్సులు ఆలస్యం కాకుండా ప్రయాణికులకు సౌకర్యం కల్పిస్తామన్నారు.