డ్వాక్రా లోన్లు రెండేండ్లలో మూడింతలు

డ్వాక్రా లోన్లు రెండేండ్లలో మూడింతలు
  • నిరుడు గ్రూపు మహిళలు చేసిన అప్పు రూ.15,745 కోట్లు
  • అంతకుముందు ఏడాది రూ.12,297 కోట్ల రుణం
  • కరోనా చికిత్స, పిల్లల చదువులు, ఎవుసం కోసమే ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని  డ్వాక్రా సంఘాల మహిళల అప్పులు పెరిగిపోతున్నాయి. రెండేండ్లలోనే మూడింతలయ్యాయి. బ్యాంకు లింకేజీ, స్ట్రీనిధి లోన్లు కలిపి నిరుడు డ్వాక్రా మహిళలు రూ.15,745 కోట్ల లోన్​ తీసుకోగా.. అంతకుముందు ఏడాది కరోనా, లాక్​డౌన్​ టైంలో రూ.12,297 కోట్లు రుణంగా తీసుకున్నారు. చాలా మంది ఉన్న అప్పులను తీర్చడానికి, కరోనా చికిత్స, కుటుంబ పోషణ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, వ్యవసాయ పెట్టుబడుల కోసమే ఎక్కువగా లోన్లు తీసుకున్నట్టు సెర్ప్​ డీపీఎం ఒకరు చెప్పారు. రెండేండ్లలో పేద, మధ్యతరగతి వాళ్లను కరోనా, లాక్​డౌన్​లు బాగా దెబ్బతీశాయి. దానికి తోడు పెట్రోల్​, డీజిల్​ రేట్లు పెరగడం, నిత్యావసరాల ధరలు, కరెంట్​ బిల్లులు పెరగడం, ఇంటి కిరాయిలు, ఇంటి పన్నులు పెనుభారంగా మారాయి. లాక్​డౌన్​తో కూలిన బతుకులు, వ్యాపారాలను నిలబెట్టుకునేందుకు మళ్లీ అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కరోనా సెకండ్​వేవ్​లో ఇంటికొకరిద్దరు కరోనా బారినపడడంతో ట్రీట్​మెంట్​ ఖర్చులకు అనేక మంది లోన్లు తీసుకున్నారు.   

డ్వాక్రా గ్రూపుల నుంచి భారీగా లోన్లు 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు కలిపి 2014–15 ఫైనాన్షియల్​ ఇయర్​లో రూ.4,394 కోట్లు రుణాలు తీసుకోగా, 2015–16లో రూ.6,331 కోట్లు, 2016–17లో రూ.6,834 కోట్లు 2017–18లో రూ.7,682 కోట్లు, 2018 –19లో రూ.8,447 కోట్లు, 2019–20లో  రూ.8,385 కోట్ల అప్పు చేశారు. కరోనా విజృంభించిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో మాత్రం రుణాలు ఒక్కసారిగా రూ.5 వేల కోట్లకుపైగా పెరిగాయి. ఆ సంవత్సరంలో బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు కలిపి రూ.12,738 కోట్లు తీసుకున్నారు. సెకండ్​వేవ్​, సెకండ్​ లాక్​డౌన్​ విధించిన 2021 – 22లో రూ.15,745 కోట్ల మేర అప్పు చేశారు. ఏడేండ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు ఆ అప్పులు ఐదింతలు పెరగడం గమనార్హం.