పార్లమెంట్ ఎన్నికల తరువాతే పీఎం అభ్యర్థిపై నిర్ణయం : రాహుల్ గాంధీ

 పార్లమెంట్ ఎన్నికల తరువాతే పీఎం అభ్యర్థిపై నిర్ణయం : రాహుల్ గాంధీ

పార్లమెంట్ ఎన్నికల తరువాతే ఇండియా కూటమి పీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.  2024 ఏప్రిల్ 05వ తేదీన  కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్..  లోక్‌సభ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తులకు, వాటిని రక్షించే శక్తులకు మధ్య జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.  లోక్ సభ  ఎన్నికల్లో గెలుస్తామని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము సైద్ధాంతికంగా పోరాడుతున్నామన్నారు రాహుల్.  

48 పేజీలతో కూడిన మ్యానిఫెస్టోను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి విడుదల చేశారు. తమ మ్యానిఫెస్టోలో ముఖ్యంగా రైతులకు పెద్దపీట వేశామని ఖర్గే తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి అవసరమయ్యే విధంగా పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించి దానికి చట్ట భద్రత కల్పిస్తామని ఖర్గే హామీ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ రద్దు చేస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద రోజుకు రూ. 4 వందలు ఇస్తామని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారెంటీలను పొందుపరిచారు.