విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆధునిక నాగరికతకు నిలయాలు 'నగరాలు'. పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే బహుళ పర్యావరణ సవాళ్లను జనసాంద్రత సృష్టిస్తోంది. వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కార్యకలాపాలు, సరిపోని వ్యర్థాల నిర్వహణతో నగరాల్లో తీవ్రమైన గాలి, నీరు, శబ్ద కాలుష్యం తప్పటంలేదు. కాంక్రీటు భవనాల మధ్య పచ్చని ప్రదేశాలు కరువయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సరాసరి 45శాతం మంది నగరాల్లో నివసిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిష్పత్తి 2050 నాటికి 70 శాతానికి పెరుగుతుందని అంచనా. ప్రపంచ పట్టణీకరణ అంచనా గణాంకాల (ఐక్యరాజ్యసమితి, 2025) ప్రకారం భారతదేశంలో 2025 నాటికి 40.03 శాతం పట్టణ జనాభా ఉంది. 2050 నాటికి 44 శాతం ఉంటుందని అంచనా. ఒక చదరపు కిలోమీటరుకు కనీసం 1,500 మంది నివాసితుల జనాభా సాంద్రత, కనీసం 50,000 మంది జనాభా ఉన్న భౌగోళిక ప్రాంతాన్ని 'నగరం/పట్టణం'గా పరిగణిస్తారు. కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను మెగాసిటీలుగా వర్గీకరించారు. యాభై లక్షల నుంచి కోటి మధ్య జనాభా ఉన్న నగరాలను పెద్ద నగరాలుగా పరిగణిస్తారు.
మధ్య తరహా నగరాలుగా పది లక్షల నుంచి యాభై లక్షల జనాభా ఉన్నవాటిని, చిన్న నగరాలుగా 250,000 నుంచి పది లక్షల మధ్య జనాభా ఉన్నవాటిని నిర్వచించారు. 250,000 కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలను చాలా చిన్న నగరాలుగా ఐక్యరాజ్యసమితి వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి 12,000 కంటే ఎక్కువ నగరాల్లో/ పట్టణాల్లో కనీసం 50,000 జనాభా ఉంది. రాబోయే దశాబ్దాలలో చోటు చేసుకోబోయే కీలక పట్టణీకరణ పోకడలను అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. నగరాలు, మానవ నివాసాలను సమ్మిళితంగా, సురక్షితంగా, స్థితిస్థాపకంగా, సుస్థిరంగా మార్చడమే ఐక్య రాజ్యసమితి 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే నూతన పట్టణ అజెండాను రూపొందించాలి. ప్రపంచ పట్టణీకరణ అంచనాలు 2025 (ఐక్యరాజ్యసమితి, 2025) ప్రకారం జకార్తా ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ సముదాయంగా ఉంది. ఇక్కడ దాదాపు 4.19 కోట్ల జనాభా ఉంది. తరువాత ఢాకా సుమారు 3.66 కోట్ల జనాభా ఉంది. టోక్యో సుమారు 3.34 కోట్ల జనాభాతో తర్వాతి స్థానంలో ఉంది. మన దేశంలోని రెండు నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. న్యూఢిల్లీ సుమారు మూడుకోట్ల జనాభాతో దగ్గరగా ఉంది. కోల్‌కతా, సియోల్‌లు ఒక్కొక్కటి సుమారు 2.25 మిలియన్ల జనాభాతో ప్రపంచంలోని టాప్ టెన్ అత్యధిక జనాభా కలిగిన పట్టణ ప్రాంతాలలో సంయుక్తంగా ఉన్నాయి.
వాతావరణ మార్పులు
నగరాల్లో పెరుగుతున్న జనాభా నిష్పత్తి ప్రకారం వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో మౌలిక వసతులు లేవు. 2040 నాటికి 200 కోట్లకు పైగా నగర నివాసితులు కనీసం 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ అదనపు ఉష్ణోగ్రత పెరుగుదలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రపంచ పట్టణ జనాభాలో 36 శాతం మంది 29 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ వార్షిక సగటు ఉష్ణోగ్రతలను భరించాల్సి ఉంటుంది. వరద ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి 100 కోట్ల ప్రజలు తీవ్రమైన నదీ వరదలకు గురయ్యే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారిలో సగంమంది నగరాల్లోనే ఉన్నారు. 1975 నుంచి పట్టణాలలో వరదలకు గురయ్యే అవకాశం గ్రామీణ ప్రాంతాల కంటే 3.5 రెట్లు పెరిగింది. ఇది వాతావరణ దుర్బలత్వాన్ని మరింత దిగజార్చింది.
క్షీణిస్తున్న పట్టణ పచ్చదనం
హస్క్‌వర్నా అర్బన్ గ్రీన్ స్పేస్ ఇన్‌సైట్స్ (కృత్రిమ మేధస్సు) 2025 నివేదిక ప్రకారం యూరప్ సుమారు 46 శాతం, నార్డిక్ దేశాలు 49 శాతం, మధ్య - తూర్పు ఆసియా 39 శాతం, ఉత్తర అమెరికా సుమారు 37 శాతం, ఆఫ్రికా 30 శాతానికి దగ్గరగా, లాటిన్ అమెరికా 29 శాతం, ఓషియానియాతో సహా తూర్పు ఆగ్నేయాసియా 27 శాతం, దక్షిణ - పశ్చిమ ఆసియా సుమారు 25 శాతం సగటు పట్టణ పచ్చని ప్రాంతాలుగా ఉన్నాయి. కొనసాగుతున్న ధోరణులను, ప్రాంతీయ నమూనాలను ఉపగ్రహ ఆధారిత అధ్యయనాలు స్పష్టంగా తెలియ చేస్తున్నాయి. వాటి ఫలితాలను ముందస్తు హెచ్చరికలుగా తీసుకోవాల్సిందే. మొత్తంమీద కొన్ని నగరాలు పట్టణ పచ్చదనాన్ని విస్తరించడంలో లేదా పునరుద్ధరించడంలో పురోగతి సాధించినప్పటికీ, నగరాల్లో పచ్చదనం వాటాలో దీర్ఘకాలిక క్షీణత గణనీయమైన ఆందోళనగా ఉందని ఆధారాలు సూచిస్తున్నాయి. 2025 అంచనాలు గణనీయమైన ప్రాంతీయ అసమానతలను సూచిస్తున్నాయి. కొన్ని పట్టణ ప్రాంతాలు పచ్చదనం పెంపు విషయంలో మెరుగ్గా ఉన్నప్పటికీ చాలా నగరాలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
సవాలుగా ఘన వ్యర్థాల సేకరణ
వేగవంతమైన పట్టణ విస్తరణకు అనుగుణంగా పురపాలక ఘన వ్యర్థాల సేకరణకు మెరుగైన, ఆధునిక పద్ధతులను పాటించాలి. నగరాలు వేగంగా విస్తరిస్తున్నందున ఘన వ్యర్థాల నిర్వహణ క్లిష్టమైన సవాలుగా మారింది. వ్యర్థాల సేకరణలో విస్తృత ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయి. మౌలిక సదుపాయాలు, పాలన, ప్రాథమిక సేవల లభ్యతలో అసమానతలను బహిర్గతం చేస్తున్నాయి. 2010 – 2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా 4,383 నగరాల నుంచి సేకరించిన గణాంకాల ప్రకారం యూరప్, ఉత్తర అమెరికా 99.4 శాతం సగటు సేకరణతో ముందంజలో ఉన్నాయి. ఆ తరువాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
(98.9 శాతం) ఉన్నాయి. ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా (94.8 శాతం), లాటిన్ అమెరికా, కరేబియన్ (90.6 శాతం) వంటి ఇతర ప్రాంతాలు మంచి పనితీరును కనబరుస్తున్నాయి. తూర్పు, ఆగ్నేయ ఆసియా (64.7 శాతం), సబ్- సహారా, ఆఫ్రికా (62.6 శాతం) అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ అంతరాలను పూడ్చడానికి సేకరణ మౌలిక సదుపాయాలలో సమన్వయంతో కూడిన పెట్టుబడి, సహాయక విధానాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు అవసరం. పట్టణాల్లో మెరుగైన వాతావరణం కోసం అవసరమైన చర్యలకు ప్రభుత్వాలు, ప్రపంచసంస్థలు ప్రాధాన్యత ఇవ్వాలి.
- డా. సునీల్ కుమార్ పోతన,
సీనియర్ జర్నలిస్ట్
