సర్కారు స్కూళ్లలో తగ్గుతున్న స్టూడెంట్ల సంఖ్య

సర్కారు స్కూళ్లలో తగ్గుతున్న స్టూడెంట్ల సంఖ్య
  • సర్కారు స్కూళ్లలో స్టూడెంట్లు తగ్గుతున్నరు
  • 8,782 బడుల్లో 30లోపే విద్యార్థులు
  • 250కి పైగా స్ట్రెంత్ ఉన్న స్కూళ్లు 1,642 మాత్రమే
  • వెయ్యి అడ్మిషన్లు దాటింది 24 పాఠశాలల్లోనే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్య తగ్గుతోంది. ‘మన ఊరు మన బడి’ స్కీమ్ కింద ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు కల్పిస్తున్నామని సర్కారు చెబుతున్నా, ఆ పనులు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. బడుల్లో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటి ప్రభావం అడ్మిషన్లపై పడింది. విద్యాశాఖ ఇటీవలే విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2022–23 అకడమి క్ ఇయర్​లో రాష్ట్రవ్యాప్తంగా  మొత్తం 26,337 స్కూళ్లుంటే, వాటిలో 8,782 బడుల్లో 30 మందిలోపు విద్యార్థులే చేరారు. వెయ్యి అడ్మిషన్లు ఉన్న స్కూళ్లు 24 మాత్రమే ఉండగా, 250 పైగా విద్యార్థులు ఉన్న బడులు1,642 మాత్రమే ఉన్నాయి. 8వ తరగతి వరకూ మొత్తం 21,465 స్కూళ్లుంటే, వాటిలో 8,665 బడుల్లో 30 లోపు స్టూడెంట్లు ఉన్నారు. 

31 నుంచి100 వరకూ అడ్మిషన్లు అయినవి 9,225 స్కూళ్లు కాగా, 3,261 బడుల్లో 101 నుంచి 250 వరకు అడ్మిషన్లు నమోదయ్యాయి. ఇక 313 బడుల్లో 251 నుంచి వెయ్యి వరకూ అడ్మిషన్లు జరిగాయి.  ఒక్క స్కూల్​లో మాత్రమే వెయ్యిమందికి పైగా స్టూడెంట్లు చేరారు. టెన్త్ వరకూ 4,872 స్కూల్స్ ఉండగా, 30 లోపు అడ్మిషన్లు 117 బడుల్లో రికార్డయ్యాయి. 1,397 స్కూళ్లలో 31  నుంచి 100  వరకూ, 2,030 బడుల్లో 101- నుంచి 250 వరకు, 1,305 స్కూళ్లలో 251 నుంచి వెయ్యి వరకు అడ్మిషన్లు నమోదయ్యాయి. 23 స్కూళ్లలో వెయ్యికి పైగా విద్యార్థులు చేరారు.