కరోనా ఎఫెక్ట్:  కార్యాలయాల్లో తగ్గిన ఉద్యోగుల హాజరు

కరోనా ఎఫెక్ట్:  కార్యాలయాల్లో తగ్గిన ఉద్యోగుల హాజరు

కరోనా కారణంగా పాక్షికంగా పనిచేసిన ప్రభుత్వ కార్యాలయాలు లాక్ డౌన్‌ ఎత్తేశాక పూర్తిస్థాయిలో సేవలు ప్రారంభించాయి. అయితే ఆ సేవలు ఎంతోకాలం కొనసాగలేదు. కార్యాలయాల్లో కరోనా కేసులు పెరగడంతో మళ్లీ పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారు. ఒక వేళ వచ్చినా పెద్దగా పనులు జరగడం లేదు. దీంతో మళ్లీ పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. లాక్ డౌన్‌ ఎత్తేశాక కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతించడంతో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, ప్రైవేట్ కార్యాలయాలూ మొదలయ్యాయి. అయితే ప్రజా రవాణా లేకపోవడంతో పలు ప్రాంతాల్లో ఉద్యోగుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉండేది. సొంత వాహనాలు ఉన్నవారు, ప్రభుత్వం కల్పిస్తున్న రవాణా సదుపాయంతో మాత్రమే కొందరు ఉద్యోగులు హాజరవుతున్నారు. ప్రధానంగా ఆదాయంతో ముడిపడివున్న సబ్‌ రిజిస్ట్రార్‌ , ఆర్టీఎ లాంటి కార్యాలయాలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ఇటీవల కరోనా కేసులు పెరగడం, ఉద్యోగులు పలువురు కరోనా బారిన పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.  లాక్ డౌన్‌ లో వైద్య ఆరోగ్యసిబ్బంది, పోలీసులు, మున్సిపల్‌, పారిశుద్ధ్య, రెవెన్యూ, గ్రామపంచాయతీ, విద్యుత్‌ విభాగాల అధికారులు, సిబ్బంది సెలవులు లేకుండా పని చేశారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్టేషన్‌, ఆర్టీఏ కార్యాలయాలు కూడా పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నాయి. అందరూ మాస్కులు ధరించి విధులకు హాజరవుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.

హైదరాబాద్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ లేక ఉద్యోగులు అనుకున్నంతగా ఆఫీసులకు రాలేకపోతున్నారు. జిల్లాల్లో ఆయా కార్యాయాలకు పూర్తి స్థాయిలో సిబ్బంది హాజరై విధులు నిర్వహించడం లేదు.   అత్యవసర విభాగాలు మినహా మిగతా విభాగాల కార్యాలయాలకు సిబ్బంది విడతల వారీగా 20 శాతం మాత్రమే హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వివిధ అవసరాల నిమిత్తం వచ్చిన ప్రజలు పనులు కావడం లేదని కార్యాలయాల ముందు పడిగాపులుగాస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌లతో పాటు వివిధ కార్యాలయాలు, బీమా కంపెనీలైన ఎల్‌ఐసీ, చిట్‌ ఫండ్‌ కంపెనీల్లో కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది.