ఇంటర్ : ఇయ్యాల్టి నుంచి .. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు అప్లికేషన్లు 

ఇంటర్ :  ఇయ్యాల్టి నుంచి .. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు అప్లికేషన్లు 
  • పోయినేడు సెకండియర్​లో 67.16%.. ఈసారి 63.49%
  • గతేడాది ఫస్టియర్​లో 63.32%.. ఈసారి 61.68% 
  • ఇయ్యాల్టి నుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు అప్లికేషన్లు 
  • జూన్ 4 నుంచి అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఫస్టియర్​లో 61.68% మంది, సెకండియర్​లో 63.49% మంది పాస్ అయ్యారు. పోయినేడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజీ తగ్గింది. గతేడాది సెకండియర్​లో 67.16 శాతం మంది పాస్ కాగా, ఈసారి 63.49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. ఫస్టియర్​లో పోయినేడు 63.32 శాతం మంది పాస్ కాగా, ఈసారి 61.68 శాతం పాస్ అయ్యారు. ఇక సర్కార్ కాలేజీల్లో దాదాపు సగం మంది స్టూడెంట్లు ఫెయిల్ అయ్యారు. సెకండియర్​లో మొత్తం 80,100 మంది పరీక్ష రాయగా 43,340 మంది మాత్రమే పాస్ అయ్యారు. పోయినేడాది సర్కారులో పాస్ పర్సంటేజీ 56.37 శాతం కాగా, అది ఈసారి 54 శాతానికి తగ్గింది. మంగళవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డులో సెక్రటరీ నవీన్ మిట్టల్​తో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ఎప్పటిలాగే ఈసారీ అమ్మాయిలు సత్తా చాటారు. సెకండియర్​లో మొత్తం 4,65,478 మంది పరీక్షలు రాయగా, వారిలో 2,95,550 (63.49%) మంది పాస్ అయ్యారు.  అమ్మాయిలు 2,29,958 మంది రాయగా 1,64,598(71.57%) మంది ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 2,35,520 మంది రాయగా 1,30,952 (55.60%) మంది పాస్ అయ్యారు. ఫస్టియర్​లో మొత్తం 4,82,675 మంది పరీక్షలు రాయగా.. 2,97,741 (61.68%) మంది పాస్ అయ్యారు. అమ్మాయిలు 2,41,673 మందికి గాను 1,65,994 (68.68%) మంది పాస్ కాగా.. అబ్బాయిలు 2,41,002 మందికి 1,31,747 (54.64%) మంది ఉత్తీర్ణత సాధించారు. 

ములుగు టాప్.. 

సెకండియర్ జనరల్ కేటగిరీలో 85 శాతం పాస్ పర్సంటేజీతో ములుగు జిల్లా టాప్ లో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో  కుమ్రంభీమ్​ ఆసిఫాబాద్ (81 శాతం), మేడ్చల్ (75 శాతం) నిలిచాయి. చివరి స్థానాల్లో మెదక్ (52 శాతం), నాగర్ కర్నూల్ (54 శాతం), వరంగల్ (58 శాతం) ఉన్నాయి. ఒకేషనల్ కేటగిరీలో 85 శాతం పాస్ పర్సంటేజీతో నారాయణపేట జిల్లా టాప్ లో ఉండగా.. 52 శాతంతో జగిత్యాల చివరి స్థానంలో ఉంది. ఇక ఫస్టియర్ జనరల్ కేటగిరీలో 75 శాతం పాస్ పర్సంటేజీతో మేడ్చల్ జిల్లా టాప్ లో ఉండగా.. 73 శాతంతో రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మెదక్ (38 శాతం), నారాయణపేట (41 శాతం) చివరి స్థానాల్లో ఉన్నాయి. 

గురుకులాలు ఫస్ట్.. 

ఇంటర్ ఫలితాల్లో గురుకులాలు సత్తాచాటాయి. ప్రైవేటు కాలేజీలతో పోలిస్తే భారీగా పాస్ పర్సంటేజీ నమోదైంది. ప్రైవేటు కాలేజీల్లో సెకండియర్​లో 63 శాతం మంది పాస్ కాగా, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ గురుకులాల్లో 92 శాతం మంది పాస్ అయ్యారు. అయితే ఎయిడెడ్​ విద్యాసంస్థల్లో మాత్రం 46 శాతం మందే ఉత్తీర్ణత సాధించారు. 

జూన్ 1 నుంచి ఇంటర్ క్లాసులు: నవీన్ మిట్టల్ 

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్​కు బుధవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఈ నెల 16 వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపర్​కు రూ.100, రీవెరిఫికేషన్​ కు రూ.600 ఫీజు చెల్లించాలని చెప్పారు. విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకున్నోళ్లకు ఆన్సర్ బుక్ లెట్ జిరాక్స్ కాపీలు ఇస్తామని పేర్కొన్నారు. ఇక జూన్ 4 నుంచి 9 వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. సప్లిమెంటరీకి కూడా బుధవారం నుంచే ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. మానసిక ఇబ్బందులుంటే హెల్ప్ లైన్ నంబర్ 14416కు కాల్ చేయాలని స్టూడెంట్లకు సూచించారు. జూన్ 1 నుంచి ఇంటర్ క్లాసులు స్టార్ట్​ అవుతాయని, త్వరలోనే ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తిచేస్తామని తెలిపారు. 

ఆందోళన పడొద్దు: సబితా ఇంద్రారెడ్డి 

ఫెయిల్ అయిన స్టూడెంట్లు ఆందోళన పడొద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. వచ్చే నెల 4 నుంచి అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఈసారి ఎంసెట్​లో ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించామని, కాబట్టి మార్కులతో ఇబ్బంది లేదన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు భరోసా ఇవ్వాలని సూచించారు. సర్కారు కాలేజీల్లో తక్కువ పాస్ పర్సంటేజీ నమోదైందని, గురుకులాలతో పోటీ పడాలన్నారు.