
గ్లామర్ హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసినా తిరుగులేని పర్‌ఫార్మెన్స్‌తో టాప్ స్టార్ అయిపోయింది దీపికా పదుకొనె. ముఖ్యంగా హిస్టారికల్ చిత్రాల్లో ఫిమేల్ లీడ్‌గా కనిపించాలంటే తనే బెస్ట్ చాయిస్ అంటున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇక సంజయ్ లీలా భన్సాలీ అయితే ప్రతి హిస్టారికల్ మూవీకీ దీపిక పేరునే మొదట పరిశీలిస్తాడు. ఆల్రెడీ అతని డైరెక్షన్‌లో రామ్ లీల, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాలు చేసింది దీపిక. వీటిలో చివరి రెండూ చారిత్రక అంశాల ఆధారంగా తీసినవే. ఇప్పుడు ఇద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. డెకాయిట్ క్వీన్ రూపమతి జీవితం ఆధారంగా ‘బైజు బావరా’ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అక్బర్ కొలువులో గొప్ప గాయకుడైన తాన్‌సేన్‌ని ఎవరూ ఓడించలేకపోయేవారు. కానీ బైజు అనే యువకుడు ఎలాగైనా ఓడించాలనుకుంటాడు. అయితే గౌరి అనే అమ్మాయి ప్రేమలో పడి లక్ష్యాన్ని మర్చిపోతాడు. అంతలో ఓ బందిపోటు ముఠా వారి రాజ్యంలోకి చొరబడుతుంది. ఆ ముఠా నాయకురాలు రూపమతి.. బైజుతో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. ఇదే కథతో, ఇదే టైటిల్‌తో 1952లో ఓ హిందీ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. మీనాకుమారి, భరత్ భూషణ్ నటించారు. ఇప్పుడు బందిపోటు రాణిగా దీపిక నటించబోతోంది. బైజు, గౌరి, తాన్‌సేన్, అక్బర్ పాత్రలకి ఫేమస్ స్టార్స్‌ని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యిందని, వచ్చే యేడు సెకెండాఫ్‌లో సినిమాని సెట్స్‌కి తీసుకెళ్తారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం పఠాన్, ‘ఇన్‌టర్న్’ రీమేక్‌తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది దీపిక. ప్రభాస్‌తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు భన్సాలీ ఫిల్మ్ కూడా ఆ లిస్టులో చేరింది.